బాహుబలిని రెండు భాగాలుగా చేసి, విడుదల చేయడం రాజమౌళి సక్సెస్ సీక్రెట్. బహుశా ఆ సినిమాని ఒకే కథగా మార్చి ఉంటే, ఈ స్థాయిలో డబ్బులు వచ్చేవి కావేమో. ఒక కథ, రెండు భాగాలుగా మార్చడంతో లాభం రెట్టింపు అయ్యింది. ఇప్పుడు ఈ ఫార్ములానే నమ్ముకుంటున్నాడు కమల్‌హాసన్. తన కొత్త సినిమా భారతీయుడు 2ని రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నాడని టాక్.
భారతీయుడు 2కి ముందు నుంచీ ఎన్నో సమస్యలు. అందులో బడ్జెట్ గోల ఒకటి. ఈసినిమా బడ్జెట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతోంది. దాన్ని తిరిగి రాబట్టుకోవడం ఎలా అనే విషయంపై కమల్ - శంకర్ దృష్టి పెట్టారు. ఈ సినిమాని రెండు భాగాలుగా విడదీస్తే.. లాభాలు డబుల్ వస్తాయని భావిస్తున్నార్ట. ఇప్పుడు ఈ విషయమై చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. రెండు భాగాలుగా మలచడం ఈజీనే. కానీ... కథలో అంత స్టఫ్ ఉందా, లేదా? అనేది చూసుకోవాలి. రెండు పార్ట్స్ కోసం కథని సాగదీస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఆ విషయాన్ని కమల్ గుర్తు పెట్టుకుంటే మంచిది.