ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 - 15 - 16 సంవత్సరాలకుగానూ నంది అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల్లో కొన్ని ప్రత్యేక అవార్డుల్ని కూడా ప్రకటించడం జరిగింది. వాటిలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం ఒకటి. ఈ అవార్డు 2014 సంవత్సరానికి విశ్వ నటుడు కమల్ హాసన్‌కి దక్కింది. 2016 సంవత్సరానికిగానూ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి దక్కింది.
తెలుగులో ఈ ఇద్దరు నటులకు మంచి గుర్తింపు, ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకు గుర్తుగానే ఈ స్పెషల్ అవార్డును ఈ ఇద్దరు నటులకు కేటాయించారు. ఈ అవార్డులు అందుకున్న కమల్‌హాసన్, రజనీకాంత్ ఏపీ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. కమల్ హాసన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ, 2016 సంవత్సరానికి రజనీకాంత్‌కి ఈ అవార్డు దక్కినందుకు ఆయనకు అభినందనలు తెలుపుతూ, తనకు ఈ గౌరవాన్ని అందించినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
కెరీర్ మొదటి నుండీ తెలుగు పరిశ్రమ తనకు ఎంతో మద్దతునిచ్చింది. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేననీ కమల్ ట్విట్టర్‌లో స్పందిచారు. నిజానికి కమల్ అవార్డుల్ని అస్సలు లెక్క చేయరు. అలాంటిది ఈ అవార్డుల విషయంలో వెంటనే స్పందించడం, థాంక్స్ చెప్పడం విశేషం. తెలుగులో 'స్వాతిముత్యం' తదితర ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారాయన. తెలుగు ప్రేక్షకుల్లో కమల్ హాసన్ అంటే ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే రజనీ విషయంలోనూ అంతే. తమిళ ప్రేక్షకులు రజనీని 'తలైవా' అని పిలుచుకుంటే సూపర్‌స్టార్ అని గౌరవంగా రజనీని గౌరవిస్తారు తెలుగు ప్రేక్షకులు. అలా ఈ ఇద్దరికీ ఈ స్పెషల్ అవార్డ్స్‌ని ఎంపిక చేయడం ఇరువురి అభిమానులకు సంతోషకరమైన విషయమే.