శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా అప్పట్లో సంచలనాత్మక విజయాన్ని సాధించింది. 'భారతీయుడు'గా కమల్ హాసన్ నటన నభూతో న భవిష్యతి. ఆ సినిమాలో కమల్ డబుల్ రోల్లో నటించారు. తండ్రీ, కొడుకుల పాత్రలో. తండ్రి చేతిలోనే కొడుకు చనిపోతాడు ఆ సినిమాలో. తన కళ్ల ముందు జరిగే అన్యాయాన్ని తట్టుకోలేని తండ్రి పాత్ర అది. ఆ విషయంలో కొడుకును కూడా విడిచి పెట్టని క్యారెక్టర్లో కమల్ హాసన్ పండించిన నటన అద్భుతం. చాలా కాలం తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రానుంది. శంకర్ దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే 'భారతీయుడు - 2'లో కమల్‌హాసన్ ట్రిపుల్ రోల్లో నటిస్తున్నారనీ సమాచారమ్. మూడు పాత్రలూ చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతున్నాయట. స్వాతంత్రోద్యమానికి సంబంధించిన కీలక ఘట్టాలు ఈ సినిమాలో ప్రత్యేకంగా చూపించబోతున్నారట. అలాగే శంకర్ ఈ సినిమాతో కొన్ని సర్ప్రైజ్లు కూడా ఇవ్వబోతున్నాడట. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది ఈ సినిమా. యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. సో మిగిలిన ఇతర భాషల్లోనూ విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాణ సంస్థలో ఇంతవరకూ చాలా సక్సెస్ఫుల్ సినిమాలు రూపొందాయి. అయితే ఈ సినిమా ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకం, చాలా చాలా స్పెషల్ అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం శంకర్ 'రోబో 2.0' సినిమాతో బిజీగా ఉన్నారు.