'కేరాఫ్ కంచెర పాలెం' అనే అతి చిన్న చిత్రంతో ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా. సురేష్ ప్రొడక్షన్స్ పై 'రానా దగ్గుబాటి' సమర్పించిన 'కేరాఫ్ కంచెర పాలెం' ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. ఇటివలే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్'లో కూడా ఈ సినిమా ప్రదర్శింపబడింది. మొత్తానికి ఈ చిన్న సినిమాతోనే మహా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. కాగా మహా తరువాత చిత్రం ఏంటా అని ఇప్పటికే 'కేరాఫ్ కంచెర పాలెం' అభిమానులు ఆరా తీస్తోన్నారు. అయితే మహా ఓ మలయాళ సినిమాని రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ సినిమానే తెలుగులోకి తీసుకురాబోతున్నారు. ఈ సినిమా పూర్తి ప్రతీకార ఛాయలున్న సినిమా అని తెలుస్తోంది. ఇక ఈ రీమేక్ సినిమాలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చాల భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి కల్లా మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. కాగా కంచెర పాలెం' సినిమా విశాఖపట్నంలోని కంచరపాలెం అనే ప్రాంత నేపథ్యంలో తీశాడు. ఆక్కడి నలుగురి వ్యక్తులకు సంబందించిన కథల్ని మహా చాల బాగా చెప్పారు. వాస్తవానికి చాలా దగ్గరగా ఉండే ఈ కథ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలుగజేసింది. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. సుబ్బరావు, రాధా బెస్సె తదితరులు నటించగా.. పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించిన ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లో కూడా రీమేక్ కానుంది. నిర్మాత యమ్. రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. మొత్తానికి ‘కేరాఫ్ కంచెరపాలెం’ తమిళ్ మలయాళ ప్రేక్షకులను కూడా పలకరించబోతుంది.