ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. తనకు సహజ అలంకారమైన నోటి దురుసుతనానికి ఇంకోసారి పని పెట్టింది. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా, తన తీరు మార్చుకోనని తెగేసి చెప్పేసింది మన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా. ఇకపోతే, తాజా కాంట్రవర్సీ విషయానికొస్తే, ఎప్పటిలాగే స్ట్రెయిట్‌గా పాయింట్‌కొచ్చేసింది. ఎలాంటి బెదిరింపులకూ లొంగేది లేదని తేల్చేసింది. చివరాఖరికి తన ప్రాణం పోయినా కూడా వెనక్కి తగ్గేది లేదనీ, తన ఆటిట్యూడ్‌లో మార్పు రాదనీ అంటోంది. ప్రస్తుతం కంగనా 'దాకడ్' అనే సినిమాలో నటిస్తోంది.
స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. 'ఏజెంట్ అగ్ని' అను పవర్ ఫుల్ రోల్‌లో కంగనా ఈ సినిమాలో కనిపించబోతోంది. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టేసే కంగనా, ఈ పాత్రకు ప్రాణం పోయడానికి చాలా హార్డ్ వర్క్ చేసింది. అక్టోబర్ 1 ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కంగనా అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. ఎందుకీ వివాదాలు.? అని ప్రశ్నిస్తే, వివాదాలతో సావాసం తనకు అలవాటయిపోయందనీ, ఆ వివాదాలు తాను కోరుకున్నవి కావనీ, వివాదాలకు ఎదురెళ్ళడం ద్వారా తాను మానసికంగా మరింత స్ట్రాంగ్ అయ్యానని కంగనా రనౌత్ ఇటీవల ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది.