బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌గా పేరున్న కంగనా రనౌత్ తాజాగా 'మెంటల్ హై క్యా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ విషయంలో మొదట్నుంచీ వివాదం రేగుతోంది. టైటిల్లోని 'మెంటల్' అనే పదమే అభ్యంతరాలకు కారణమవుతోంది. అయితే, మన ఫైర్ బ్రాండ్ కంగనా మాత్రం ఏది ఏమైనా టైటిల్ మార్చేది లేదని ఇంతవరకూ ఖరాఖండిగా చెప్పుకొచ్చింది. కానీ, వివాదం ముదిరి పాకాన పడింది. ఇప్పటికే సినిమా ట్రైలర్ విడుదల కావల్సి ఉంది. కానీ, వివాదం కారణంగా వాయిదా పడింది.
ట్రైలర్ విడుదలకే పరిస్థితి ఇలా ఉంటే, ఇక సినిమా విడుదల విషయానికి వచ్చేసరికి ఎలా ఉండబోతోందోనని చిత్ర యూనిట్ వెనక్కి తగ్గిందట. కంగనాకి నచ్చచెప్పే ప్రయత్నం చేసిందట. దాంతో మొదట్లో వినని కంగనా కూడా సిట్యువేషన్ సీరియస్ అని అర్ధం చేసుకోవడంతో దారికొచ్చిందట. టైటిల్ మార్చేందుకు ఒప్పుకుందట. సో ప్రజెంట్ ఈ టైటిల్‌ని మార్చే దిశగా 'మెంటల్ హై క్యా' టీమ్ సెర్చింగ్ స్టార్ట్ చేసిందనీ తెలుస్తోంది.
అంటే, కంగనా నటిస్తున్న 'మెంటల్ హై క్యా' టైటిల్ మారనుందన్న మాట. ఇప్పటికే ఈ టైటిల్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది. ఆల్రెడీ విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలూ జనాన్ని బాగా ఎట్రాక్ట్ చేశాయి. అయితే, టైటిల్ మారిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. మన తెలుగు డైరెక్టర్ ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకి దర్శకుడు. జూలై 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.