`మణికర్ణిక` విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు. కానీ... దర్శకురాలిగా కంగనా రనౌత్ పేరు కూడా టైటిల్ కార్డులో కనిపించింది. ఈ సినిమాలో క్రిష్ తీసిన కొన్ని సన్నివేశాల్ని కంగనా తొలగించి, ఆ సన్నివేశాల్ని తనే స్వయంగా రీ షూట్ చేసింది. మరీ ముఖ్యంగా.. సోనూసూద్ పాత్రని తొలగించి.. సోనూసూద్ పై ఆధిపత్యం చెలాయించాలని చూసింది.
ముందు అనుకున్న కథ ప్రకారం.. సోనూ సూద్ పాత్ర పతాక సన్నివేశాల వరకూ ఉంటుంది. కానీ.. సోనూసూద్ ఉంటే, తన పాత్రకు ప్రాధాన్యం తగ్గింపోతుందన్న భయంతో.. ఆ పాత్రని బలవంతంగా కుదిరించింది. ఈ విషయపై ఆ తరవాత వివాదాలు రేగిన సంగతి, క్రిష్ తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరిచిన సంగతీ తెలిసిందే. ఈ విషయంపై క్రిష్ మరోసారి స్పందించాడు. `ఆహా`లో ప్రసారమయ్యే ఓ చాట్ షోలో... క్రిష్ `మణికర్ణిక` వివాదం వెనుక ఉన్న అసలు కారణం బయటపెట్టాడు.
షూటింగ్ అంతా అయిపోయిన తరవాత.. నిర్మాతలకు క్రిష్ రషెష్ చూపించాడు. ఆ రషెష్ చూసిన నిర్మాతలు సంతృప్తి వ్యక్తం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతుండా.. కంగనా ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సన్నివేశాలు బాలేవని, కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరిగా లేదని, సోనూ సూద్ చేసిన సదాశివ్ పాత్ర విషయంలో తనకు అభ్యంతరాలు ఉన్నాయని క్రిష్‌కి చెప్పిందట. ఆ పాత్రని విశ్రాంతి తరవాత లేకుండా చేయాలని సూచించిందట. అయితే.. దానికి క్రిష్ ఒప్పుకోలేదట. దాంతో క్రిష్ ని పక్కన పెట్టి, తాను ఆ సన్నివేశాల్ని రీషూట్ చేసుకుందని క్రిష్ ఆవేదన వ్యక్తం చేశారు. కంగనా జోక్యంతో తాను అనుకున్న కథని... వెండి తెరపై తీసుకురాలేకపోయానని క్రిష్ ఆవేదన వ్యక్తం చేశారు.