సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'పద్మావత్' చిత్రం ఈ మధ్య ఎన్ని వివాదాలకు, ఆందోళనలకు కారణమైందో తెలిసిన సంగతే. ఎట్టకేలకు సినిమా సుప్రీంకోర్టు ఆదేశాలతో, కొన్ని ఆంక్షలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలా సంగతి పక్కన పెడితే, సినిమాకి టాక్ బాగానే వస్తోంది.
కర్ణిసేన ఆందోళనలు చేసినట్లుగా, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలేమీ లేవని తేలిపోయింది. అయితే కర్ణిసేన ఎంత మొత్తుకున్నా, సినిమా విడుదలను ఆపలేకపోయారు. వద్దన్నా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినందుకు కర్ణిసేన మరో కీలక నిర్ణయం తీసుకుందట. సంజయ్‌లీలా భన్సాలీ తల్లి జీవితాధారంగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నామంటూ కర్ణిసేన జిల్లా అధ్యక్షుడు తెలిపారు.
చిత్తోర్‌ఘడ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఈ విషయానిన ప్రకటించారు. సంజయ్‌లీలా భన్సాలీ రాజ్‌పుత్‌లకు అమ్మవంటి పద్మావతిని అవమానిస్తూ సినిమా తెరకెక్కించారు. కనకనే ఆయన తల్లిపై మేం సినిమా తీయబోతున్నాం. అయితే భన్సాలీ చేసినట్లుగా, అవమానకరంగా మా ఈ సినిమా ఉండబోదనీ ఆయన తెలిపారు. మరో పదిహేను రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుందట. అరవింద్ వ్యాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ సినిమాని పూర్తిగా రాజస్థాన్‌లోనే చిత్రీకరించనున్నారట. ఇకపోతే 'పద్మావత్' నిన్ననే ప్రేక్షకుల ముందుకొచ్చింది. వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. రాణి పద్మావతి పాత్రలో దీపికా పదుకొనె నటించింది. రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ఇతర ముఖ్య తారాగణంగా నటించారు.