ఇటీవలే 'చినబాబు' సినిమాతో ప్రశంసలు అందుకున్న తమిళ హీరో కార్తి మరోసారి ఆ తరహా పాత్రలో నటించబోతున్నాడంటూ నెట్టింట్లో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది.
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. వైఎస్ బయోపిక్ అంటే జగన్ క్యారెక్టర్ ఉండి తీరాలి కదా. మరి ఆ పాత్రలో నటించే ఆ నటుడు ఎవరు.? అంటే అది తమిళ హీరో కార్తి అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ, ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యింది. కార్తి అంటే రొమాంటిక్ హీరో. అన్ని భావాలు పలుకుతాయిలెండి. కానీ ఆయన జగన్ పాత్రలో నటించేందుకు ఒప్పుకుంటాడా? అనేది అందరిలోనూ నెలకొన్న ప్రశ్న.
ఒకవేళ ఒప్పుకుంటే ఈ సినిమాకి మరింత వెయిట్ పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. కార్తికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. 'ఊపిరి'తో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించాడు కార్తి. అలాగే తాజా సినిమా 'చినబాబు'తో సహా గతంలో కార్తి నటించిన పలు చిత్రాలు తెలుగులో మంచి విజయం అందుకున్నాయి. అలా ఇప్పుడు 'యాత్ర'తో మరోసారి కార్తి తెలుగులో సందడి చేస్తాడేమో చూడాలి మరి.
వైఎస్సార్ పాత్రలో మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి నటిస్తున్నాడు. ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. భూమిక, సుహాసిని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'ఆనందోబ్రహ్మ' ఫేం మహి.వి.రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.