హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన అందాల నటి జ్యోతిక తమిళ హీరో సూర్యని పెళ్లి చేసుకున్నాక, సినిమాలకు కాస్త బ్రేకిచ్చి, ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సెకండ్ ఇన్నింగ్స్‌లో జ్యోతిక సరికొత్త కధాంశాలను ఎంచుకుంటూ, ప్రశంసలు అందుకుంటోంది. అందులో భాగంగా ఈ నెల 16న జ్యోతిక నటించిన 'నాచియార్' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జి.వి. ప్రకాష్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అద్దం పట్టేలా ఈ సినిమా స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో జ్యోతిక ఓ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ గా ఊర మాస్ పాత్రను పోషించింది. మొదట్లో ఈ పాత్ర సంభాషనలపై మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినా, సినిమా విడుదలయ్యాక కథా బలాన్ని బట్టి, అభ్యంతరాలేమీ ఎదురు కాలేదు. ఓ బాలికపై అత్యాచారం కేసు ఉదాంతంగా ఈ సినిమా స్టోరీ నడుస్తుంది. నేరస్థులను పట్టుకుని విచారించడంలో జ్యోతిక పాత్ర చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ కోవలో ఆమె నోటి వెంట అభ్యతరకర పదజాలం వస్తుంది. అయితే ఆ పాత్రకి ఆమాత్రం అవసరం ఉందనీ సినిమా విడుదల తర్వాత అర్ధమైంది. దాంతో విడుదలకు ముందు తలెత్తిన వివాదాలు సమసిపోయాయి.
విమర్శకుల ప్రశంసలు అందుకుంటోందీ సినిమా. తాజాగా ఈ సినిమా చూసి జ్యోతిక మరిదిగారైన హీరో కార్తీ వదిన నటనను ప్రశంసిస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రభావవంతమైన స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగుందనీ, అన్ని (వదిన), ప్రకాశ్ నటన ఆకట్టుకునేలా ఉందనీ, మంచి స్టోరీతో పాటు, ఎంటర్‌టైనింగ్ అంశాలు కూడా ఈ సినిమాలో చాలా ఉన్నాయనీ, అందరికీ ఖచ్చితంగా నచ్చే సినిమా 'నాచియార్' అనీ కార్తి ట్వీట్ చేశారు.