తమిళ నటుడు అయినా కార్తిని తెలుగులో కూడా పక్కింటబ్బాయ్‌లానే ఆదరిస్తారు. ఎప్పటి నుండో తమిళంలో స్టార్ హీరోలుగా చెలామణీ అవుతూ, తెలుగులో కూడా ఓ మోస్తరు నుండి మంచి మార్కెట్ రేంజ్ ఉన్న సూర్య, విశాల్ తదితర హీరోలు చేయని సాహసం కెరీర్ మొదట్లోనే చేసేసి ప్రశంసలు అందుకున్నాడు కార్తి. అదేనండీ, స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించడం. నాగార్జునతో 'ఊపిరి' సినిమాలో కార్తి నటనకు 100కు 100 మార్కులు పడిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత కార్తి సినిమాలకు తెలుగులో కూడా ఆదరణ దక్కుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా కార్తి 'ఖైదీ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో నో సాంగ్స్, నో హీరోయిన్స్ అన్న సంగతిని ముందే చిత్ర యూనిట్ ప్రకటించేసింది. అంటే, ఓన్లీ కార్తి మీదే బేస్ అయ్యి ఈ సినిమాని తెరకెక్కించారన్న మాట. కార్తి గతంలో నటించిన 'ఖాకీ' సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటించింది. అయితే, రకుల్ పాత్ర సినిమాలోని సీరియస్‌నెస్‌ని తగ్గించేసిందనే విమర్శలు వినిపించాయి.
దాంతో, దారి లేక సినిమా నుండి ఆమె సీన్లను తప్పించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అలాంటి సీరియస్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న 'ఖైదీ'కి అలాంటి సమస్యే ఎదురు కాకుండా, ముందే హీరోయిన్ లేని సినిమా అని అనౌన్స్ చేసేశారు. అయితే, కమర్షియల్ ఎటాచ్‌మెంట్ కోసం హీరోయిన్, పాటలు, గ్లామర్ తప్పనిసరి. అలాంటిది, వాటిని పక్కన పెట్టేసి 'ఖైదీ' టీమ్ చాలా పెద్ద రిస్క్ చేసిందనుకోవాలి. మరి ఈ రిస్క్‌ని 'ఖైదీ' టీమ్ ఎలా ఓవర్ కమ్ చేస్తుందో చూడాలిక. దీపావళికి 'ఖైదీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.