2013లో విడుదలైన కార్తికేయ మంచి విజయాన్ని అందుకొంది. నిఖిల్ - చందూ మొండేటి కాంబోలో వచ్చిన ఈ సినిమాకి దాదాపు పదేళ్ల తరవాత పార్ట్ 2 వస్తోంది. అనేక మార్లు విడుదల తేదీ వాయిదా వేసుకొని, ఎట్టకేలకు శనివారం బాక్సాఫీసు ముందుకు వస్తోంది. నిఖిల్ నటించిన ఓ సినిమా థియేటర్లో విడుదలై చాలా కాలమైంది. అందుకే కార్తికేయ 2 విజయం సాధించడం నిఖిల్ కి అత్యవసరం. పైగా.. ఈ సినిమాకి భారీ బడ్జెట్ కేటాయించారు. అదంతా తిరిగి రాబట్టుకుంటుందా, లేదా? అనేది ఆసక్తిగా మారింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.18 కోట్లకు అమ్మడైంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 20 కోట్లు తెచ్చుకోవాలి. అదే జరిగితే నిఖిల్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయడం ప్లస్ పాయింట్.కానీ.. తమిళ, మలయాళ భాషల్లో నిఖిల్ కి అస్సలు మార్కెట్ లేదు. ఈ సినిమా సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కాబట్టి, అక్కడి ప్రేక్షకులు ఓ లుక్ వేస్తారని ఓ నమ్మకం. పైగా ఇప్పుడు థియేటర్ల దగ్గర కాస్త హడావుడి కనిపిస్తోంది. గత వారం విడుదలైన రెండు సినిమాలూ మంచి విజయాలు అందుకొన్నాయి. ఆ నమ్మకం కార్తికేయ 2 నిర్మాతల్లో కనిపిస్తోంది. మరి... ఏం జరుగుతుందో చూడాలి.