థియేటర్ వ్యవస్థ కుదేలైపోయిందని అందరూ బాధ పడుతున్న రోజులు ఇవి. ఓటీటీ నుంచి ముంచుకొస్తున్న ముప్పుని పసిగట్టిన టాలీవుడ్ కొత్త నిబంధలతో చిత్రసీమని రిపేర్లు చేయడానికి నడుం కట్టింది. అందులో భాగంగా సినిమా విడుదలైన 50 రోజుల వరకూ... ఓటీటీలో ప్రదర్శించకూడదని నిర్మాతలంతా తీర్మాణించారు. ఈమధ్య కొన్ని పెద్ద సినిమాలు ఆలస్యంగానే రిలీజ్ అయ్యాయి. అయితే దిల్ రాజు తెరకెక్కించిన `థ్యాంక్యూ` కేవలం 20 రోజుల వ్యవధిలోనే ఓటీటీలోకి వెళ్లిపోతోంది.
మూడు వారాలకే ఓటీటీలోకి సినిమాలు వచ్చేస్తున్నాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ వైఖరి మారాలని... ఇటీవల గిల్డ్ మీటింగులో బల్లగుద్ది మరీ చెప్పి, అందరినీ ఒప్పించిన దిల్ రాజు, ఇప్పుడు తన సినిమాకి వచ్చే సరికి, 20 రోజుల్లోనే సినిమాని ఓటీటీకి ఇచ్చేయడం దారుణమని కొంతమంది నిర్మాతలు దిల్ రాజు వైఖరిపై మండి పడుతున్నారు.
`థ్యాంక్యూ` బాక్సాఫీసు దగ్గర అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాకి భారీ రేటుకి కొన్న అమేజాన్, ఈ సినిమాకి ఓటీటీలోకి విడుదల చేయడానికి తొందరపెడుతోంది. అందుకే ఇంత త్వరగా ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేయాల్సివస్తోంది. పైగా థ్యాంక్యూ ఓటీటీ డీల్ ముందే క్లోజ్ అయ్యిందని అందుకే 20 రోజుల్లో ఈ సినిమాని విడుదల చేయాల్సివస్తోందని దిల్ రాజు కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.