బాలీవుడ్ లో ప్రేమ పక్షులకు కొదవ లేదు. ప్రస్తుతం అక్కడ హాయిగా విహరిస్తున్న జంట విక్కీ కౌశల్, కత్రినా కైఫ్. వీరిద్దరి ప్రేమ కబుర్లని కథలు కథలుగా చెప్పుకుంటుంది బాలీవుడ్ మీడియా. అయితే ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసి, ఇద్దరి నిశ్చితార్థం జరిగిపోయిందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కథనాలు ప్రసారం చేస్తోంది. విక్కీ, కత్రినాల కుటుంబాలు ఈ పెళ్లికి అంగీకరించాయని, దీపావళి రోజున ముహూర్తాలు కూడా చూసుకున్నారని టాక్. డిసెంబరులో ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందని, అయితే డేట్ మాత్రం తేలాలని తెలుస్తోంది.
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లని ఓ రిసార్ట్‌లో పెళ్లి వేడుక జరగనుందని సమాచారం. ఇటీవల కత్రినా తల్లి, సోదరి ఇటీవల ముంబైలోని ఒక దుస్తుల దుకాణంలో కనిపించారు. పెళ్లి షాపింగ్ కోసమే ఈ మాల్ కి వచ్చారని అప్పుడే మీడియా పసిగట్టేసింది. కానీ విచిత్రం ఏమిటంటే, ఇప్పటి వరకూ అటు కత్రినా గానీ, ఇటు విక్కీ గానీ తమ ప్రేమ, పెళ్లి విషయాల్లో మీడియా దగ్గర మౌనంగా ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ కలిసి, మీడియా ముందుకొస్తారని, పెళ్లి కబురు వినిపస్తారని టాక్.