బిగ్‌బాస్ సీజన్ 2 రియాల్టీ షో ముగిసింది. విన్నర్‌గా కౌశల్ అనౌన్స్‌మెంట్ జరిగిపోయింది. ఈ 113 రోజుల్లో కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా వేదికగా చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు. ఓ స్టార్ హీరో సినిమాకి సైతం ఇంతటి స్థాయిలో హడావిడి జరగలేదనడం అతిశయోక్తి కాదు. కౌశల్ వ్యతిరేకుల్ని ఈ కౌశల్ ఆర్మీ చీల్చి చెండాడేసింది. ఓ దశలో కొందరు జుగప్సాకరమైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాని 'డస్ట్ బిన్'లా మార్చేశారన్న విమర్శలూ లేకపోలేదు.
సీజన్ ముగిసింది గనుక, కౌశల్ ఆర్మీ తదుపరి కార్యాచరణ ఏమిటి? అనే చర్చ జరుగుతోంది. అసలు ఈ కౌశల్ ఆర్మీ వెనుక ఎవరున్నారో కూడా ఇప్పటిదాకా తెలియలేదు. కానీ కౌశల్ విజేతగా ప్రకటితమయ్యాక, ఆయన ఇంటి వద్ద అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. త్వరలో కౌశల్‌ని సన్మానించేందుకు భారీ ఏర్పాట్లను కౌశల్ ఆర్మీ చేస్తోందట. అదెంతవరకు వాస్తవమో తెలియలేదు. ఇప్పటికైతే కౌశల్ ఆర్మీ వేడి సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతూనే వుంది.
గేమ్ వరకే ఎమోషన్స్ అని కౌశల్ చెప్పినా, గేమ్ ముగిశాక కూడా కౌశల్ ఆర్మీ అదే ఎమోషనల్ టెంపో కొనసాగిస్తూ వస్తోంది. సీజన్ వన్‌కి ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. కౌశల్ విన్నర్ అయ్యాడు గనుక, బయట ఏం జరుగుతోందో ఇప్పుడు ఆయనకు తెలిసింది గనుక, ఇప్పుడు కౌశల్ ఆర్మీని సైతం ఆయన అదుపు చేయాల్సి వుంటుంది. లేని పక్షంలో ఇప్పటిదాకా కౌశల్ సంపాదించుకున్న అభిమానం, ఆయనకు ముందు ముందు చెడ్డపేరు తెచ్చే అవకాశం లేకపోలేదు.