'అరవింద సమేత' సినిమా లీకుల టెన్షన్‌ని ఎదుర్కొంది. అంతకు ముందు 'జై లవ కుశ' సినిమాకీ ఈ లీకుల గోల తప్పలేదు.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజకి లీకుల టెన్షన్ షురూ అయ్యింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఇప్పటివరకూ ఈ సినిమాకి సంబంధించి ఆన్ లొకేషన్ కొన్ని స్టిల్స్‌ని చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చారు. అయితే, అవి ఫ్యాన్స్‌ని అలరించేందుకు తప్ప, సినిమాకి సంబంధించిన ఏ అంశాన్నీ బయటపెట్టలేదు.
కానీ లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో లీక్ అయిన ఫొటోలు మెగా ఫ్యాన్స్‌లో కొంత గందరగోళం సృష్టిస్తున్నాయి. చరణ్, ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో పాల్గొన్న ఫొటోలవి. కేవలం ఫొటోలు మాత్రమే లీక్ అయ్యాయా? వీడియోలు కూడా వున్నాయా? అనేదానిపై గందరగోళం కొనసాగుతోంది. విదేశాల్లో సినిమా షూటింగ్ జరుగుతుండగా, అక్కడ జరిగిన యాక్షన్ ఎపిసోడ్ తాలూకు ఫొటోలు ఎలా వచ్చాయో ఎవరికీ అర్థం కావడంలేదు.
నిర్మాత డివివి దానయ్య, దర్శకుడు బోయపాటి శ్రీను అత్యంత పకడ్బందీగా సినిమా షూటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. సెట్‌కి దగ్గర్లో ఎవరూ మొబైల్ ఫోన్ వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అయినా స్టిల్స్ లీక్ అవడంతో నిర్మాత కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫొటోలు ఎలా లీక్ అయ్యాయో తెలుసుకునేందుకు ఓ పక్క ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే, ఇంకోపక్క ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది చిత్ర యూనిట్.