సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ హవా తగ్గుముఖం పట్టింది. అయితే, కౌశల్‌కి వచ్చిన ఫాలోయింగ్ మాత్రం కొనసాగుతోంది. బిగ్ బాస్ రియాల్టీ షో కౌశల్‌ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. 'మేనేజ్ చేశారు' అంటూ కౌశల్ ఆర్మీ మీద వచ్చిన ఆరోపణల సంగతెలా వున్నా, కౌశల్ ఆర్మీ మాత్రం బిగ్ బాస్ రియాల్టీ షో చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
ఆ సంగతి పక్కన పెడదాం. కౌశల్ తనకు కనీ వినీ ఎరుగని రీతిలో 40 కోట్ల ఓట్లు వచ్చాయని పదే పదే చెబుతున్నాడు. అయితే దీనికి సంబంధించి బిగ్ బాస్ తరఫున అధికారికంగా ఎలాంటి లెక్కలూ విడుదల కాలేదు. ఒక్కో వ్యక్తీ 50 ఓట్లు వేయడానికి వీలుంది. ఇది కూడా, ఓ అకౌంట్ ద్వారా ఇంటర్నెట్‌ని ఆధారం చేసుకుని. ఫోన్ ద్వారా మరో 50 ఓట్లు వేసేందుకు అవకాశముంది. అంటే ఓ వ్యక్తి ఒక ఫోన్, ఒక కంప్యూటర్ ద్వారా 100 ఓట్లు వెయ్యొచ్చు. స్మార్ట్ ఫోన్ అయితే మరో 50 ఓట్లు వేసెయ్యొచ్చు. సో, 150 ఓట్లు ఒకే వ్యక్తి వేస్తే.. 40 కోట్లని ఆ 150తో మైనస్ చేస్తే వచ్చే లెక్క ఎంత.? పైగా, ఒక్క రోజులో పోల్ అయిన ఓట్లు కాదు 40 కోట్లు అంటే.
నాలుగైదు రోజులకు పైనే ఓట్లను కౌంట్ చేశారు. కౌశల్, బిగ్ బాస్ రియాల్టీ షోతో సంచలనం సృష్టించిన మాట వాస్తవం. అయితే తన గెలుపుని ఇంకా ఎక్కువగా చూపించాలనే 'అతి' ఆరాటం అతనికి చేటు చేస్తుంది తప్ప, మేలు చేయదు. కౌశల్ ఆర్మీ సైతం, సోషల్ మీడియాలో 'అబ్యూస్' చేయడం మానటం లేదు. షో ముగిశాక, హౌస్ మేట్స్ తమ తమ పనుల్లో బిజీగా వున్నారు. వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం, వివాదాస్పద వ్యాఖ్యలు వారిపై చేయడం జుగుప్సాకరం.
కౌశల్ ఇమేజ్‌ని స్టార్ హీరో ఇమేజ్‌తో సమానంగా ఊహించేసుకోవడం కౌశల్ ఆర్మీ అమాయకత్వానికి నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది జస్ట్ వాపు మాత్రమేననీ, బలుపు అనుకోవడానికి వీల్లేదని కౌశల్ ఆర్మీకి పలువురు మేధావులు సూచిస్తున్నారు.