విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలో సూపర్ స్టార్ ఇమేజ్‌కి దగ్గరగా ఎలా వచ్చాడు? అనే ప్రశ్నకు 'రౌడీస్' చెప్పే సమాధానమొక్కటే. అది విజయ్ దేవరకొండ నిజాయితీ. తన సినిమా విషయంలో వున్నది వున్నట్లే మాట్లాడతాడు. సినీ కెరీర్ గురించి ఖచ్చితమైన అభిప్రాయాలుంటాయి ఆయనకి.
ముందస్తుగా ఫ్రేమ్ చేసుకుని, విజయ్ దేవరకొండ ఏమీ మాట్లాడడు. అందుకే 'రౌడీస్' అంటూ 'పవనిజం' తరహాలో విజయ్ దేవరకొండకి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే 'నోటా' విషయంలో మాత్రం ఆ రౌడీస్‌ని విజయ్ దేవరకొండ చాలా డిజప్పాయింట్ చేశాడు. సినిమా టాక్ గురించి కాదు, సినిమా ఎలా వుంటుందో తెలిసీ సినిమాపై హైప్ పెంచేయడానికి విజయ్ చేసిన పబ్లిసిటీ స్టంట్స్ కారణంగా 'రౌడీస్' ఇప్పుడు ఫీలవుతున్నారు.
దీన్నొక డబ్బింగ్ సినిమాగా మాత్రమే పరిగణించాలని 'రౌడీస్' ఇంకా తమ అభిమాన హీరోని వెనకేసుకొస్తున్నారు. బై లింగ్వల్ సినిమాలతో వచ్చే పెద్ద సమస్య ఇది. విజయ్ లాంటి హీరో, బై లింగ్వల్ చేస్తున్నప్పుడు, అందులో తెలుగు నేటివిటీ, తమిళ నేటివిటీ సమానంగా వుండేలా చూసుకోవాల్సింది. గతంలో 'కింగ్' నాగార్జున 'రక్షకుడు' అనే సినిమా చేశాడు. ఆ సినిమా విషయంలోనూ అదే జరిగింది.
తమిళ డబ్బింగ్ ఫ్లేవర్ కన్పించింది. నిజానికి అందులో కంటెంట్ యూనివర్సల్. అయినా ఆ సినిమా ఆడలేదు. అదే తమిళ హీరోలు తమిళంలో చేసే సినిమాలకి, తెలుగు నేటివిటీ టచ్ కూడా వుంటోంది. తన అభిమానులైన 'రౌడీస్' కోసం అయినా, విజయ్ 'నోటా' కథ విషయంలో, నేటివిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బావుండేది. పోనీ, దీన్నొక తమిళ డబ్బింగ్ సినిమాలా విజయ్ ప్రొజెక్ట్ చేసినా 'రౌడీస్' ఇంతలా ఫీలయ్యేవారు కాదు.