బుల్లితెర బిగ్‌బాస్ రియాల్టీ షో విజేతగా కౌషల్ నిలిచాడు. కౌషల్ చెప్పిన వేటగాడు కథ నిజమైంది. 113 రోజుల కష్టం ఫలించింది. 18 మంది కంటెస్టెంట్లు, 113 రోజుల జర్నీలో జన్యూన్‌గా గేమ్‌ని గేమ్‌లా ఆడిన కంటెస్టెంట్ కౌషల్‌నే బిగ్‌బాస్ కిరీటం వరించింది.
బిగ్‌హౌస్‌లో కౌషల్ కష్టం, కౌషల్‌ని గెలిపించేందుకు బయట కౌషల్ ఆర్మీ పడిన కష్టం ఫలించింది. కౌషల్‌నే బిగ్‌బాస్ విజేతగా పట్టం కట్టారు. లక్షలాది మంది ప్రేక్షకులు, అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ ఘట్టానికి ఎట్టకేలకు శుభం కార్డ్ పడింది. అత్యంత ఘనంగా నిర్వహించిన 'బిగ్‌బాస్' గ్రాండ్ ఫినాలే ఫంక్షన్‌లో హోస్ట్ నాని ఎంట్రీ అదిరిపోయింది.
ఎక్స్ కంటెస్టెంట్లు డాన్సులతో బిగ్‌బాస్ స్టేజ్ కలర్‌ఫుల్‌గా మారింది. ప్రో కబడ్డీ లీగ్ తెలుగు టైటాన్స్ టీమ్‌ని బిగ్‌బాస్ వేదికపై పరిచయం చేశాడు హోస్ట్ నాని. స్టేజ్‌పై తెలుగు టైటాన్స్‌తో కలిసి సరదాగా కబడ్డీ ఆడి ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు. చివరిలో స్పెషల్ గెస్ట్‌గా విచ్చేసిన విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బిగ్‌బాస్ ట్రోఫీని విజేత అయిన కౌషల్‌కి అందించింది బిగ్‌బాస్ టీమ్.
బిగ్‌బాస్ ట్రోఫీతో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు కౌషల్. తన తల్లి క్యాన్సర్‌తో చనిపోయిందనీ, సో ఈ ప్రైజ్ మనీని మొత్తం అలా క్యాన్సర్ బారిన పడి ఏ తల్లీ చనిపోకూడదనే ఉద్దేశ్యంతో వారి వైద్యం కోసం డోనేట్ చేస్తున్నానని కౌషల్ చెప్పిన చివరి మాటతో మరోసారి అందరి మనసుల్ని గాఢంగా దోచేశాడు కౌషల్.