తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా కోసం చాలా మంది సన్నాహాలు చేశారు. అయితే ఏమైందో తెలీదు కానీ, సెట్స్ మీదికెళ్లాల్సిన మూడు నాలుగు సినిమాలు చర్చల దశలో ఆగిపోయాయి. వీటిలో దర్శక, నిర్మాత మధురా శ్రీధర్ ప్లాన్ చేసిన సినిమా కూడా ఒకటి ఉంది. చాలా భారీగా ఈ సినిమాకి ప్లాన్ చేశారు కానీ, ఎందుకు ఆగిపోయిందో ఎవరికీ తెలీదు.
2019 సార్వత్రిక ఎన్నికలను పరిగణలోకి తీసుకుని కేసీఆర్ బయోపిక్ కోసం ఓ టీఆర్‌ఎస్ ముఖ్యనేత సన్నాహాలు చేసినా, ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రయత్నం కూడా విరమించుకున్నారట. ఇదిలా ఉంటే, చంద్రబాబు బయోపిక్ దాదాపుగా పూర్తయిపోయిందట. కానీ ఆ సినిమా పట్ల పెద్దగా క్రేజ్ లేదు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నందమూరి తారకరామారావు బయోపిక్స్ మాత్రం వార్తల్లో నిలిచి ఉన్నాయి.
వైఎస్సార్ బయోపిక్‌కి 'యాత్ర' అనే టైటిల్ పెట్టారు. ప్రముఖ మలయాళ నటుడు ముమ్ముట్టి ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. నందమూరి నటసింహాం బాలయ్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్‌ని రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. మొదటి పార్ట్‌కి 'కథానాయకుడు' అనీ, రెండో పార్ట్‌కి 'మహానాయకుడు' అనే టైటిల్స్ పెట్టారు.
ఇదిలా ఉంటే, తెలంగాణ అస్థిత్వ పోరాటం, కేసీఆర్ ఉద్యమ నాయకత్వం బేస్ చేసుకుని 'కేసీఆర్ బయోపిక్' తీసి ఉంటే ఖచ్చితంగా అదొక సంచలనమై ఉండేది. కానీ దురదృష్టవశౄత్తూ 'కేసీఆర్ బయోపిక్' అనే ఆలోచన ఆనాధగా మిగిలిపోయింది.