కీరవాణి పాటలంటే... శబ్ద సౌందర్యంతో పాటు అర్థ సౌందర్యమూ కనిపిస్తాయి. వాయిద్యాల మాటున మాటలూ శ్రద్దగా వినిపిస్తాయి. సాహిత్యానికి పెద్ద పీట వేసే సంగీత దర్శకుడాయన. ఆయన పాటల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. అయితే కొంతకాలంగా ఆయన మార్కు బాణీలు వినిపించడం లేదు. 'బాహుబలి' సిరీస్ మినహాయిస్తే... తనదైన శైలి ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం ఆయన 'ఎన్టీఆర్' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమాకి ఎలాంటి పాటలు అందిస్తారో.. అని బాలయ్య అభిమానుల టెన్షన్. ఆ అనుమానాల్ని పటా పంచలు చేస్తూ... 'ఎన్టీఆర్'లోని తొలి పాట విడుదలైపోయింది. 'ఘనకీర్తి సాంధ్ర.. విజితాఖిలాంద్ర' అంటూ సాగిన ఈ పాటని కీరవాణి తండ్రిగారైన శివశక్తి దత్తా రచించారు. ఖైలాష్ ఖేర్ పాడారు.
పాటలంతా ఎన్టీఆర్ ఘన కీర్తి గురించే. మూడొందల చిత్రాలు చేసిన విధానం, రకరకాల పాత్రలు పోషించిన వైనం.. అక్షరాల్లో పోతపోసి అందమైన పాటగా మార్చారు. అన్నీ సంస్క్కృత పదాలే. అయినా అర్థమైపోతాయి. 'ఎన్టీఆర్' సంగీత యాత్రకు ఇది ఘనమైన ఆరంభమే అనుకోవాలి. కీరవాణి స్వరపరచిన విధానం, ఖైలాష్ ఆలపించిన పద్ధతి.. స్వరంలో ఇమిడిపోయిన పదాలు - ఇవన్నీ కలసి పాటకు వన్నె తీసుకొచ్చాయి. తొలి రెండు భాగాల్లో కలిపి మొత్తం 11 పాటలు ఉండబోతున్నాయి. నాలుగు బిట్ సాంగ్స్ కూడా వినిపిస్తాయి. వారానికో పాట చొప్పున విడుదల చేయాలన్నది చిత్రబృందం వ్యూహం. తదుపరి పాట ఎలా ఉండబోతోందో చూడాలి.