ఈ మధ్య అమేజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన చిత్రం 'పెంగ్విన్'. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి అమేజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్‌కి పెట్టింది. ఈ సినిమా చూసినవాళ్లంతా పెదవి విరిచారు. అబ్బే... ఇందులో కొత్తదనం లేదని, క్లైమాక్స్ మరీ వీక్ అని తేల్చేశారు. ఈ సినిమాకి దాదాపు 7 కోట్లకు కొనుగోలు చేసింది అమేజాన్. దాంతో. ఈ సినిమాతో అమేజాన్ నష్టపోతుందని లెక్కగట్టారు.
కానీ ఆ లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. పెంగ్విన్‌కి అమేజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూవర్ షిప్ దక్కుతోంది. ఈమధ్య విడుదలైన అన్ని సినిమాలకంటే పెంగ్విన్ కే ఎక్కువ వ్యూస్ వచ్చాయట. అమేజాన్ హిట్ సినిమాల్నీ, హిట్ వెబ్ సిరీస్‌లనూ దాటుకుని పెంగ్విన్ వ్యూవర్ షిప్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ సినిమాని మూడు భాషల్లో విడుదల చేయడం, కీర్తి లాంటి స్టార్ ఉండడం బాగా కలిసొచ్చాయి. బయట టాక్ ఎలా వున్నా - ఓటీటీ లెక్కల ప్రకారం ఈ సినిమా హిట్టయినట్టే. త్వరలో రాబోయే మరిన్ని ఓటీటీ సినిమాలకు ఈ లెక్కలు ఊతం అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.