నటుడు, యాంకర్, దర్శకుడు `ఈటీవీ` ప్రభాకర్ కి కరోనా సోకిందన్న వార్త టీవీ ఇండ్రస్ట్రీని షాక్ కి గురి చేసింది. ప్రభాకర్ కి కరోనా పాజిటీవ్ అని తేలిందన్న వార్త సోషల్ మీడియాలో గట్టిగా షికారు చేసింది. అయితే దీనిపై ప్రభాకర్ స్పందించారు. తనకు కరోనా లేదని, తాను ఆరోగ్యంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ప్రభాకర్ అనే మరో నటుడు ఉన్నాడని, ఆయనకు పాజిటీవ్ వచ్చిందని, ఇద్దరి పేర్లూ ఒకటే కావడం వల్ల కన్‌ఫ్యూజ్‌కి గురయ్యారని ఆయన అన్నారు. అన్ని జాగ్రత్తల నడుమ షూటింగ్ చేసుకుంటున్నామని, ప్రస్తుతం అంతా సజావుగా సాగుతుందని ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
అయితే.. ఓ నటుడికి కరోనా సోకడం పై టీవీ సీమ ఉలిక్కిపడింది. లాక్ డౌన్ నిబంధనల నుంచి షూటింగులకు మినహాయింపు ఇవ్వడంతో ఇటీవలే టీవీ సీరియళ్ల షూటింగులు మొదలయ్యాయి. ఇంతలోనే ఓ నటుడికి కరోనా సోకడంతో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆందోళన చెందుతున్నారు. టీవీ సీరియళ్ల షూటింగులను ఆపేయాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దీనిపై టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈ రోజు ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోందని సమాచారం.