రెండు రోజుల క్రితమే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఫాదర్స్ డే జరుపుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫాదర్స్ డే హంగామా మామూలుగా లేదు. తండ్రిప్రేమను తెలియజేస్తూ, మా నాన్న సూపర్ అంటే మా నాన్న ఇంకా సూపర్ అంటూ ఒకరిని మించి ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరైతే నాన్నను మిస్ అవుతున్నామని కూడా పోస్టులు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పూజా హెగ్డే ఫాదర్స్ డే పోస్ట్ మరో ఎత్తు.
ఫాదర్స్ డే రోజు నాన్నగారి చేత వంట చేయించడమే కాకుండా, అదిలేదు ఇది లేదని ఆయనని సతాయించింది. ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసి "నేను, రిషబ్ హెగ్డే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నాన్నగారు మాకు ఫాదర్స్ డే లాంటివి మార్కెటింగ్ జిమ్మిక్కులని, ప్రతిరోజూ ఫాదర్స్ డే అని చెప్పారు. ఇప్పటికీ మేము ఆయనను ఆ విషయం మర్చిపోనివ్వడం లేదు. అందుకే మా హెగ్డే కుటుంబంలో ఇలా ఫాదర్స్ డే జరుపుకున్నాం. హ్యాపీ రెగ్యులర్ డే డాడీ. మేము నిన్ను ప్రేమిస్తున్నాం" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇక వీడియోలో పూజ నాన్నగారు మంజునాథ్ హేగ్డే కిచెన్ లో వంట చేస్తూ ఉంటే, ఏప్రాన్ వేసుకోలేదని, అన్ని వస్తువులు ప్లాట్ ఫామ్ పై పెట్టి గజిబిజి చేశారని, ఓపెన్ చేసిన డ్రా క్లోజ్ చెయ్యలేదని, మాస్క్ పెట్టుకోలేదని సణుగుతూ ఉంది. ఇక ఆయన కూడా తక్కువేమీ తినలేదు. మాస్క్ పెట్టుకుంటే కూర రుచి ఎలా చూడాలి? అంటూ ప్రశ్నించారు. ఏదేమైనా హెగ్డే గారి కుటుంబం 'రెగ్యులర్ డే' నెటిజన్లను ఆకర్షిస్తోంది.