'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, టాలెంటెడ్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుని, తక్కువ కాలంలోనే క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. కొత్త సంవత్సరంలో ఈ ముద్దుగుమ్మకి తిరుగే లేదని చెప్పాలి. ఏడాది మొదట్లోనే తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.
'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్‌కి మరదలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇదిలా ఉండగా, తమిళంలో ఈ ముద్దుగుమ్మ జ్ఞాన్‌వేల్ రాజా నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తోంది. సూర్య కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ ఓ బ్రాహ్మణ యువతి పాత్రలో నటిస్తోందట. ఈ పాత్ర ఆమెకు చాలా బాగా నచ్చిందట. అన్నింటికీ మించి, తమిళంలో తన ఫేవరేట్ హీరో సూర్య సరసన నటిస్తుంది ఈ చిత్రంలో కీర్తి సురేష్.
సినీ ఫ్యామిలీ నుండి వచ్చిన కీర్తి సురేష్, చిన్నప్పుడే అనుకుందట. హీరోయిన్ అయ్యాక సూర్యతో ఒక్క సినిమాలోనైనా నటించాలని. అప్పుడు అదో డ్రీమ్ అట ఈ ముద్దుగుమ్మకి. ఆ డ్రీమ్ ఈ ఏడాదిలో నెరవేరబోతోందని మురిసిపోతోంది. ఈ సంక్రాంతికే ఆ సినిమా కూడా విడుదల కాబోతోంది. 'తానా సేంద కుట్టం' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సంక్రాంతి ఎంతో ఎంతో స్పెషల్ అంటోంది అందుకే కీర్తి సురేష్. ఇటు తెలుగులో పవర్ స్టార్‌తో, అటు తమిళంలో తన డ్రీమ్ స్టార్‌తో నటిస్తున్న రెండు చిత్రాలూ ఒకేసారి విడుదల అవుతుండడంతో కీర్తి సురేష్ ఆనందానికి అస్సలు అవధుల్లేవు.