'మహానటి' సినిమాతోనే నిజంగానే తాను మహానటిననిపించుకుంది కీర్తి సురేష్. తక్కువ సినిమాలతోనే ఇంతటి పేరు ప్రఖ్యాతులు దక్కడం నిజంగా ఆమె అదృష్టం. ఆ అదృష్టానికి తోడు, ఆమె చాలా కష్టపడింది కూడా. అయితే, ఆ తర్వాతే కథల ఎంపికలో పొరపాట్లు చేసేస్తోంది. పెద్ద సినిమాల ఆఫర్స్ అనగానే ఎగిరి గంతేయడం తప్ప, ఆ సినిమా తన కెరీర్‌కి ఎంతవరకు ఉపయోగపడ్తుందో ఆలోచించుకోవడంలేదు.
విక్రమ్ సరసన చేసిన 'సామి-2' సినిమా బోల్తా కొట్టేయడం కీర్తి సురేష్‌కి చాలా పెద్ద మైనస్. ఆ సినిమా తర్వాత వచ్చిన విశాల్ 'పందెంకోడి-2' కూడా కీర్తి సురేష్‌కి నిరాశపరిచే ఫలితం ఇచ్చిందని ట్రేడ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. మాస్‌ని కొంతవరకు ఈ సినిమా అలరిస్తున్నా, కీర్తి సురేష్ విషయంలో కొన్ని నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె నెక్స్‌ట్ మూవీపై అనుమానాలు పెరిగిపోయాయి.
మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతోన్న 'సర్కార్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కీర్తి సురేష్ చాలా అంచనాలే పెట్టుకుంది. 'మహానటి'గా దక్కిన 'కీర్తి' ఇప్పుడు మళ్ళీ 'సర్కార్'తో అందిస్తుందని కీర్తి సురేష్ ధీమా వ్యక్తం చేస్తోంది. కథల ఎంపికల విషయంలో పొరపాట్లు ఏమీ చేయడంలేదనీ, ఒక్కోసారి కొన్ని సినిమాలు వర్కవుట్ అవకపోవడం అనేది మామూలేనని కీర్తి అభిప్రాయపడ్తోంది.
మూసపాత్రలకే పరిమితం కాకుండా, భిన్న పాత్రల్ని ఎంచుకోవడం వల్ల ఒక్కోసారి ఫలితాలు రివర్స్ అయ్యే అవకాశం లేదని కీర్తి చెబుతున్న విషయాల్నీ ఎలా కాదనగలం?