బీస్ట్, కేజీఎఫ్ 2... ఒకే రోజు వ్యవధిలో విడుదలైన సినిమాలు. బీస్ట్ కంటే, కేజీఎఫ్‌కి హైప్ ఎక్కువ. పైగా కేజీఎఫ్ అచ్చమైన పాన్ ఇండియా సినిమా. కాకపోతే.. తమిళనాట కేజీఎఫ్ 2 పప్పులు ఉడకవు... అనే నిర్ణయానికి వచ్చేశారంతా. ఎందుకంటే.. తమిళ జనాలకు ప్రాంతీయ అభిమానం మెండు. అక్కడ విజయ్ ఓ సూపర్ స్టార్. విజయ్‌తో పోటీ పడడం అంటే మాటలు కాదు. కాబట్టి.. ఇండియా అంతా.. కేజీఎఫ్ 2కి బ్రహ్మరధం పట్టినా, తమిళనాడులో మాత్రం ఆదరణ దక్కకపోవొచ్చని అంచనా వేశారు. అయితే... వాటన్నింటినీ కేజీఎఫ్ 2 వసూళ్లు పటాపంచలు చేసేశాయి.
కేజీఎఫ్‌కి తమిళనాట ఊహించని వసూళ్లు వస్తున్నాయి. తొలి రోజు బెనిఫిట్ షో టికెట్లన్నీ.. సేల్ అయిపోయి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది కేజీఎఫ్ 2. గురువారం ఈ సినిమాకి ఊహించని వసూళ్లు రావడం, అదే సమయంలో బీస్ట్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. బీస్ట్ ఆడుతున్న థియేటర్లలోంచి ఆ సినిమాని తొలగించి, కేజీఎఫ్2 ని ప్రదర్శించడం మొదలెట్టారు. దాంతో విజయ్ సినిమాకి మరింత పెద్ద దెబ్బ పడినట్టైంది. గురు, శుక్రవారాల్లో కేజీఎఫ్ 100% ఆక్యుపెన్సీ సంపాదించుకుంటే.... బీస్ట్ కి సగం థియేటర్లు కూడా నిండలేదు. దాంతో... తమిళనాడులో కూడా కేజీఎఫ్ ముందు బీస్ట్ తలవొంచాల్సివచ్చింది.