ఇంటర్నేషనల్ టెక్నీషియన్లను తీసుకుంటేనే సినిమాలో భారీతనం అని భావిస్తుంటాం. కానీ అది తప్పని వారిస్తున్నాడు కన్నడ హీరో యష్. కన్నడ మూవీ 'కేజీఎఫ్'తో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించిన హీరో యష్. 'బాహుబలి' సినిమా తర్వాత ఆ స్థాయిలో మాట్లాడుకున్న సినిమా 'కేజీఎఫ్'. యూనివర్సల్ స్టార్‌గా 'బాహుబలి'తో పేరు తెచ్చుకున్న ప్రబాస్ తర్వాత ఆ స్థానం దక్కించుకున్న హీరో కూడా యష్‌నే.
'కేజీఎఫ్'కి వచ్చిన హైప్ కారణంగా ఈ సినిమాకి సెకండ్ పార్ట్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సాదా సీదాగా రూపొందించిన 'కేజీఎఫ్'కే ఆ రేంజ్‌లో గుర్తింపు, వసూళ్లు దక్కితే, ఇక నిర్మాణపరంగా మంచి వేల్యూస్ ఇస్తే, ఆ సినిమా ఇంకెంత సక్సెస్ అవుతుందో కదా అని భావించిన 'కేజీఎఫ్ 2' టీమ్ కాస్టింగ్‌తో పాటు, టెక్నీషియన్స్ విషయంలోనూ హై రేంజ్‌లో ఆలోచిస్తున్నారట. ఇప్పటికే బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ని ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఎంచుకున్న సంగతి తెలిసిందే.
ఇక యాక్షన్ ప్రధానాంశంగా రూపొందుతోన్న 'కేజీఎఫ్ 2' కోసం కనీ వినీ ఎరుగని యాక్షన్ సీక్వెన్సెస్‌ని సిద్ధం చేస్తున్నారట. అందుకోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్స్‌ని ఎంచుకునే దిశగా కసరత్తులు చేస్తున్నారట. అయితే హీరో యష్ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. నిర్మాణ పరంగా వేల్యూస్ తీసుకురావాలంటే బోలెడంత బడ్జెట్ పెట్టి హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకురావక్కర్లేదు. మన లోకల్ టెక్నీషియన్లలోనే బోలెడంత టాలెంట్ ఉంది.
హాలీవుడ్‌తో పోల్చితే వీరేం తక్కువ కారు అంటూ చిత్ర యూనిట్‌కి సూచనలిచ్చాడట యష్. నిజమే. నిజమైన టాలెంట్ మనలోనే ఉంది. అనవసరంగా నేషనల్, ఇంటర్నేషనల్ అని గొప్పల డప్పులు కొట్టుకుంటూ, మన లోకల్ టాలెంట్‌ని అవమానపరుస్తున్నాం. ఇది గుర్తించిన యష్‌కి హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే.!