కర్ణాటకలోని 'కోలార్' పేరు చెప్పగానే బంగారం గుర్తొచ్చేది చాలా మందికి. బంగారు గనులకు కోలార్ కేరాఫ్ ఆడ్రస్. అయితే ఇది ఒకప్పటి మాట.
2001లో ఈ గనుల్ని మూసి వేశారు. ఒకప్పటి ఆ బంగారు వెలుగుల్ని మాత్రం ఇప్పటికీ చాలా మంది మర్చిపోలేదు. ఆనాటి ఆ బంగారు ప్రపంచాన్ని మన కళ్ల ముందుంచబోతోంది 'కె.జి.ఎఫ్'. 'కె.జి.ఎఫ్' అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఆ పేరుతో ఓ టౌన్ షిప్ కూడా ఏర్పాటైంది అక్కడ. బంగారం వెలికితీత క్రమంలో జరిగిన కొన్ని సంఘటనలకు సినిమాటిక్ టచ్‌ని జోడించి కె.జి.ఎఫ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
కన్నడలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. మామూలుగా కన్నడ సినిమాలు అంతగా తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల ముందుకు రావు. కానీ 'కె.జి.ఎస్' సబ్జెక్టుకున్న యూనివర్సల్ అప్పీల్‌కి కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. డిశంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఓ కన్నడ సినిమాకి ఈ స్థాయిలో పబ్లిసిటీ జరగడం చిన్న విషయం కాదు. ఆల్రెడీ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కి ఐదు భాషల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 12 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది. కన్నడ నటుడు యష్ హీరోగా నటించిన సినిమా ఇది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.