భరత్ అనే నేను తో టాలీవుడ్ లో అడుగుపెట్టింది కైరా అద్వాణీ. ఆ సినిమా విజయవంతం అవ్వడంతో కైరాకి అవకాశాలు వరుస కట్టాయి. అయితే వినయ విధేయ రామాతో ఫ్లాప్ ఇచ్చింది. ఆ ఒక్క ఫ్లాపుతో తెలుగులో అవకాశాలు యూ టర్న్ తీసుకుని వెళ్లిపోయాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో తనుకు ఓ గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. అదీ మహేష్ బాబు సినిమాలో. కానీ... దాన్ని కాలదన్నుకుని టాలీవుడ్ కే షాక్ ఇచ్చింది కైరా.
మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. కథానాయికగా కైరా అద్వాణీని అనుకున్నారు. మహేష్ తో సినిమా, పైగా భరత్ అనే నేను కాంబినేషన్... అందుకే కైరా కూడా `నో `చెప్పదు అనుకున్నారు. కానీ.. కైరా మాత్రం సింపుల్ గా సారీ చేప్పేసింది. దానికి కారణం.. బాలీవుడ్ లో నాలుగు సినిమాలతో బిజీగా ఉండడమేనట. లాక్ డౌన్ వల్ల ఆయా షూటింగులు ఆగిపోయాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతాయో చెప్పలేని పరిస్థితి. షూటింగులు మొదలైతే.... తొలి ప్రాధాన్యం వాటికే ఇవ్వాలి. అందుకే.. మహేష్ సినిమాని వదులుకోవాల్సివచ్చింది. ఇదే విషయం చిత్రబృందానికీ వివరించిందట. తన పరిస్థితిని మహేష్,పరశురామ్ లు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మరో కథానాయిక కోసం అన్వేషణ మొదలెట్టారు.