తెలుగు సినీ పరిశ్రమలో కథల కొరత గురించి అందరికీ తెల్సిందే. కథలు లేక, వున్న కథల్నే అటు తిప్పి ఇటు తిప్పి కమర్షియల్ హంగులు జోడించి సినిమాలు తీసేస్తున్నారన్న అభిప్రాయాలు ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా విన్పిస్తున్నాయి. కొరియన్ సినిమాల్నీ, ఇతర భాషలకు చెందిన సినిమాల్నీ ఎత్తేసి.. చిన్న చిన్న మార్పులు చేసేసి, తెలుగులో తీసేస్తున్నారన్న విమర్శలు ఈ మధ్య పెద్ద సినిమాలూ ఎదుర్కొంటున్నాయి. అయితే, లాక్‌డౌన్ నేపథ్యంలో కొత్త కథల పుట్టుక చాలా ఎక్కువగా కన్పిస్తోందట. కథా రచయితలు తమ కలాలకు పదును పెట్టారట బాగానే ఈ లాక్‌డౌన్ సీజన్‌లో. ‘కథలు రాసుకోవడానికి చాలా సమయం దొరుకుతోంది..’ అంటూ ఓ ప్రముఖ దర్శకుడే చెప్పుకొచ్చాడు. కథా రచయితగా ఎంత పేరున్నా, దర్శకుడిగా మారాక ఆయన కూడా కథల్ని ఎరువు తెచ్చుకోక తప్పని పరిస్థితి నిన్న మొన్నటిదాకా.
ఇకపై ఆ పరిస్థితి ఆయనకు వుండబోదేమో.! చాలామంది దర్శకులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంటే, కరోనా వైరస్.. తెలుగు సినీ పరిశ్రమకి ఓ రకంగా మేలు చేసిందని అనుకోవాలేమో. కానీ, ది¸యేటర్ల మూతతో తెలుగు సినీ పరిశ్రమకు కలిగిన నష్టాల్ని పూడ్చడం అంత తేలిక కాదు. కనీ వినీ ఎరుగని నష్టమిది. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ నష్టం సినీ పరిశ్రమకు కలిగింది కరోనా వైరస్ కారణంగా. ఏదిఏమైనా, ఈ సీజన్‌లో పుట్టిన కథలు, తెరకెక్కడానికి కొంత సమయం పట్టొచ్చు. ఆ కథలెలా వుంటాయో.. ఎలాంటి అద్భుతాలు వెండితెరపై ఆవిష్కృతమవుతాయో వేచి చూడాల్సిందే.