రాజావారు, రాణీగారుతో ఆకట్టుకున్నాడు కిరణ్ అబ్బవరపు. `ఎస్.ఆర్.కల్యాణ మండపం`తో ఓ సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో బిజీ హీరోగా మారిపోయాడు. తన నుంచి వస్తున్న మరో సినిమా `సబాస్టియన్ పి.సి.నెంబ.524`. ఇందులో కానిస్టేబుల్ గా కనిపించబోతున్నాడు కిరణ్. అయితే ఈ కానిస్టేబుల్ కి రేచీకటి. ఆ విషయాన్ని దాచి మరీ పోలీస్ ఉద్యోగం పట్టేస్తాడు హీరో. కానీ దురదృష్టమేమిటంటే.. సబాస్టియన్ ఉద్యోగంలో జాయిన్ అయినప్పటి నుంచీ... మదనపల్లెలో.. వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ఓ రోజు రాత్రి... పోలీస్ స్టేషన్‌లో సబాస్టియన్ ఒక్కడే డ్యూటీ చేస్తుండగా, మదనపల్లెలో కలకలం రేగుతుంది. దాన్ని ఓ రేచీకటి పోలీసు ఎలా హ్యాండిల్ చేశాడన్నదే కథ. ఈ సినిమా టీజర్ ఈరోజే విడుదలైంది.
హీరోకి రేచీకటి అనేది టీజర్ తొలి షాట్‌లోనే చెప్పేశాడు దర్శకుడు. ఆ తరవాత.. ఫన్, డ్రామా కొనసాగించాడు. కానిస్టేబుల్ కి రేచీకటి ఉండడం, అదే ఊర్లో ఓ రాత్రి హంతకుడు చొరబడడం ఇవన్నీ ఆసక్తిని కలిగించే ఎలిమెంట్సే. కిరణ్ అబ్బవరపు కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇవన్నీ కలిసొస్తే... తన ఖాతాలో మరో హిట్ పడినట్టే. ఈ సినిమాలో హీరో పేరుని బట్టి తాను క్రిస్టియన్ అయినా, తాను ప్రభువు బిడ్డ మాత్రం కాదు. ఇది మరో ట్విస్టు. దాన్ని కూడా ఈ టీజర్‌లో రివీల్ చేసేశాడు దర్శకుడు. మరి... సబాస్టియన్ అలా ఎందుకు మారాల్సివచ్చిందన్నది తెరపై ఎంత అందంగా, ఎంత సరదాగా చూపిస్తే అంత బాగుంటుంది. కోమలి ప్రసాద్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ సయ్యపు రెడ్డి దర్శకుడు. ఈనెల 24న విడుదల అవుతోంది.