జయాపజయాలు దైవాదీనాలు. ఎక్కడైనా వాటిని తేలిగ్గా అంచనా వేయొచ్చేమో గానీ, సినిమా పరిశ్రమలో మాత్రం కాదు. ఇండస్ట్రీలో ఓ ఫ్లాప్ ఎదురైతే, ఆ ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది కుటుంబాలపై పడుతుంది. అయితే ఎక్కువగా బాధపడేది నిర్మాతే. ఆ ప్రభావం తనమీద కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు మహేష్. తాజాగా అన్ స్టాపబుల్ లో బాలయ్యతో చిట్ చాట్ చేశాడు మహేష్. ఈ సందర్భంగా... ఫ్లాపుల గురించి చెప్పుకొచ్చాడు.
తన ఫ్లాపులకు తానే బాధ్యుడ్నని, సినిమా ఫ్లాప్ అయితే రూమ్‌లోకి వెళ్లిపోయి, రెండు మూడు రోజులు ఒంటరిగా గడుపుతానని, ఆ టైమ్ లో ఎవరితోనూ మాట్లాడనని, ఆ సినిమాపై ఆధారపడిన వాళ్లని ఎలా బయటపడేయాలో ఆలోచిస్తానని చెప్పాడు మహేష్. ``నేను ఒప్పుకోకపోతే. సినిమా మొదలయ్యేది కాదు. బయటకు వచ్చేదే కాదు. అంటే ఫ్లాప్ కి నేనే బాధ్యుడ్ని. ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఎవరిపై నెట్టేయను. ఇప్పటి వరకూ నా జయాపజయాలకు నేనే కారణం`` అని నిజాయతీగా చెప్పాడు మహేష్. అన్ స్టాపబుల్ లో మహేష్ ఇలా చాలా విషయాల్ని పంచుకున్నాడు. ప్రస్తుతం ఆహాలో ఈ ఇంటర్వ్యూ స్ట్రీమింగ్ అవుతోంది.