చిత్రసీమలో ప్రాజెక్టులు చేతులు మారడం చాలా సహజం. ఒకరి కథ మరొకరికి వెళ్తుంది. ఓ హీరోని అనుకుని.. చివరికి మరో హీరోతో సర్దుకుపోవాల్సివస్తుంది. అలా.. ఇప్పుడు మరో సినిమా చేతులు మారింది. యువ దర్శకుడు కిషోర్ తిరుమల వెంకటేష్ కోసం ఓ కథ సిద్ధం చేసుకున్నాడు. దానికి `ఆడాళ్లూ మీకు జోహార్లూ` అనే టైటిల్ పెట్టాడు. వెంకీ తో చర్చలు జరిగాయి. ఆయన ఓకే అన్నారు. కానీ ఏమైందో ఏమో.. ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. ఇప్పుడు కిషోర్ తిరుమల శర్వానంద్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు.
శర్వా కూడా.. కిషోర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. 2021లో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. వెంకటేష్ కథనే.. శర్వాతో తీస్తున్నారన్నది టాక్. టైటిల్ కూడా `ఆడాళ్లూ మీకు జోహార్లూ`నేనట. సో... వెంకీ కథలో.. శర్వా కనిపించబోతున్నాడన్నమాట. అయితే.. వెంకీ వేరు, శర్వా వేరు. ఇద్దరి జనరేషన్లు వేరు. ఇద్దరి శైలి వేరు. వెంకీ కోసం రాసుకున్న కథకి శర్వా ఎంత వరకూ న్యాయం చేయగలడు? అన్నదే ప్రధాన ప్రశ్న. శర్వా మంచి నటుడే. కానీ.. తనపై స్టార్ ఇమేజీ లేదు. ఈ కథని శర్వా స్టైల్‌కి తగ్గట్టు మార్చొచ్చు.కానీ ఎంత మార్చినా వెంకీ, శర్వాల ఇమేజ్ ల మధ్య తేడా ఉంది కదా. మరి కిషోర్ తిరుమల ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో..?