దర్శకులకు, టెక్నీషియన్లకూ మహేష్ బాబు ఇచ్చే గౌరవం వేరు. ఒకర్ని నమ్మితే.. వాళ్లని వదిలిపెట్టడు. ఈ విషయం చాలాసార్లు రుజువైంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలతో కొరటాల శివకూ మహేష్ ఆప్తుడైపోయాడు. వీరిద్దరి మధ్య అనుబంధం ప్రత్యేకమైనది. తనని మహేష్ ఎంత గౌరవిస్తాడో, ఎంత నమ్ముతాడో.. కొరటాల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఆచార్య లో చిరంజీవి కాకుండా మరో కీలకమైన పాత్ర ఉంది. దాన్ని రామ్ చరణ్ తో చేయిస్తే బాగుంటుందన్నది కొరటాల ఆలోచన. అయితే `ఆర్.ఆర్.ఆర్` షూటింగ్ తో చరణ్ స్ట్రక్ అయిపోయాడు. అక్కడ ఎప్పుడు ఫ్రీ అవుతాడో తెలీదు. రామ్ చరణ్ వస్తే గానీ, `ఆచార్య`లో ఆ పాత్ర భర్తీ అవ్వదు. షూటింగ్ పూర్తికాదు. దాంతో అనుకున్న సమయానికి ఈ సినిమా విడుదల చేయడం అసాధ్యంగా మారింది.
ఈ పరిస్థితి తెలుసుకున్న మహేష్ స్వయంగా కొరటాలతో `మీకు అభ్యంతరం లేకపోతే.. ఆ పాత్ర నేను చేస్తా` అన్నాడట. అది కూడా కథ వినకుండా. మహేష్ లాంటి పెద్ద స్టార్ స్వచ్చందంగా ముందుకొచ్చి `నేనున్నా` అంటూ ఓ దర్శకుడికి భరోసా ఇవ్వడం కనీ వినీ ఎరుగని విషయం. కొరటాలపై మహేష్‌కి ఉన్ననమ్మకానికి అది నిదర్శనం. కాకపోతే.. ఇప్పుడు సమస్యలన్నీ క్లియర్ అయ్యాయి. `ఆచార్య`లో నటించడానికి చరణ్‌కి ఎలాంటి అభ్యంతరమూ లేకుండా పోయింది. మహేష్ అవసరం లేకుండానే ఈ సినిమా పూర్తి కానుంది.