నిన్నా మొన్నటి వరకూ కొరటాల శివ అంటే తిరుగులేని దర్శకుడిగానే అందరికీ గుర్తొచ్చేవాడు. ఆయన తీసిన సినిమాలన్నీ హిట్టే. అయితే ఆ ట్రాక్ రికార్డుకు బ్రేకులు వేసింది ఆచార్య. చిరంజీవితో సినిమా తీసే అవకాశం వచ్చినా, హిట్టు కొట్టలేకపోయానన్న బాధ ఒకవైపు, ఈ సినిమా ఆర్థికలావాదేవీలన్నీ నెత్తిమీద వేసుకొని, ఆ బరువు మోయలేక అనుభవిస్తున్న నరకం మరో వైపు. ఆచార్య ఆర్థిక వ్యవహారాలన్నీ కొరటాలనే చూసుకోడంతో బయ్యర్లకు సెటిల్ చేయాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే పడింది.
మొన్నటికి మొన్న నైజాం బయ్యర్లకు సర్దుబాటు చేసేశారు కొరటాల. అందుకోసం తన ఆస్తుల్ని సైతం అమ్ముకోవాల్సివచ్చింది. దాంతో కొరటాల ఈ సమస్య నుంచి గట్టెక్కారనిపించింది. అయితే ఇప్పుడు సీడెడ్ బయ్యర్లు కొరటాలని కార్నర్ చేస్తున్నారు.
హైదరాబాద్ లోని కొరటాల శివ ఆఫీసుకు 20, 30 మంది బయ్యర్లు వచ్చి... తిష్ట వేశారని తెలుస్తోంది. తమకు రావాల్సిన సొమ్ము వస్తే గానీ ఇక్కడి నుంచి కదలమని భీష్మించుకొని కూర్చున్నార్ట. వాళ్లందరికీ తక్కువలో తక్కువ రూ.15 కోట్ల వరకూ సెటిల్ చేయాల్సిఉందని సమాచారం. ఇందులో సగం ఇస్తే గానీ వాళ్లు కదలరు. ఇదంతా కొరటాల తన జేబులోంచి తీసి ఇవ్వాల్సిన మొత్తమే. అయితే తన ఆఫీసులో ఇంత జరుగుతున్నా.. కొరటాల ఎవ్వరికీ అందుబాటులో లేడని, అయితే తెర వెనుక ఈ వ్యవహారాన్ని సెటిల్ చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. పాపం.. ఆచార్య కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో..?