ప్రతీ సినిమాకి డైరెక్టర్‌తో పాటు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా చాలా మంది పని చేస్తుంటారు. కానీ వారెవరో ఎవరికీ తెలియదు. చాలా అరుదుగా తమ టీమ్ మెంబర్స్‌ని డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ పరిచయం చేస్తుంటారు. ఇది చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అయితే 'భరత్ అనే నేను' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా పని చేసిన టీమ్ మొత్తాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్ కొరటాల శివ.
ఇది ఓ రకంగా సినిమా ప్రమోషన్స్‌లో భాగమైనప్పటికీ, కొరటాల శివ చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. తెరపై కనిపించే ఆర్టిస్ట్స్ కష్టం సినిమా చూస్తే ఎలాగూ కనిపిస్తుంది. అయితే తెరపై వారంతా అంత అందంగా కనిపించడానికి తెర వెనుక బోలెడంత కష్టపడాల్సి వస్తుంది. వివిధ విభాగాల్లో పని చేసేవారు తెర వెనుక పడిన కష్టానికి తగ్గ ఫలితమే తెరపై కనిపించే మెరుపులు. అలాంటి వారందర్నీ మీడియా ముందుకు తీసుకొచ్చి, 'భరత్' ఈ స్థాయిలో విజయం సాధించినందుకు వీరి కష్టమే కారణం అని కొరటాల చెప్పాడు.
సినిమా ప్రమోషన్స్‌లో నిజానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ మినహాయిస్తే, హీరో, హీరోయిన్లు ఇతర ముఖ్య నటీ నటులు మాత్రమే ఎక్కువ భాగం పంచుకుంటారు. కానీ 'భరత్'తో ఇదో కొత్త ఛేంజ్ అని చెప్పాలి. తెర వెనక టెక్నీషియన్లు కూడా ముందుకొచ్చి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సరికొత్త సాంప్రదాయానికి కొరటాల శివ శ్రీకారం చుట్టాడు. అందుకే కొరటాల ఇంకా ఇంకా నచ్చేస్తున్నాడు. ఆయన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు.