కొరటాల శివ లక్కే లక్కు. ఆయన నక్క తోకని కాదు, ఏకంగా నక్కనే తొక్కేశాడు. అవును.. ఒక్క పైసా కూడా పెట్టకుండా, మహేష్ బాబు సినిమా లాభాల్లో వాటా పొందడం తక్కువ విషయమా? మహేష్ బాబు సినిమా ఏమిటి? అందులో కొరటాలకు వాటా రావడమేమిటి? అనుకుంటున్నారా, అక్కడికే వస్తున్నాం. మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా అందిస్తున్నాయి.
ఈ చిత్ర లాభాల్లో ఇప్పుడు కొరటాల శివకీ వాటా ఉందని తెలుస్తోంది. అలాగని ఈ సినిమాకి ఆయనేం నిర్మాత కాదు. మహేష్ - పరశురామ్ కాంబోని సెట్ చేసే విషయంలో కొరటాల శివ కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీస్నీ, 14 రీల్స్నీ కలిపింది ఆయనే. పరశురామ్ ని మహేష్ బాబు దగ్గరకు పంపిందీ ఆయనే. ఈ కథ మహేష్‌కి బాగుంటుందని సూచించిందీ ఆయనే. అందుకే ఇప్పుడు ఈ సినిమాసెట్ అయ్యింది కాబట్టి, తన కృషికి ప్రతిఫలంగా ఈ సినిమా లాభాల్లో వాటా కావాలని కొరటాల అడిగాడట. దానికి ఇద్దరు నిర్మాతలూ ఓకే అనేశారు. మరి లాభాల్లో ఎంత శాతం తీసుకుంటాడో తెలీదు గానీ, ఆ రూపంలో కనీసం 5 కోట్లయినా కొరటాల తన జేబులో వేసుకునే అవకాశం ఉంది. లక్ అంటే.. ఇదే కదా.