అల వైకుంఠపురములో సూపర్ హిట్ తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. బాహుబలి తరవాత ఆల్ టైమ్ రికార్డు తన ఖాతాలో వేసుకుందీ చిత్రం. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో సుకుమార్ సినిమాని మొదలెడుతున్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లాల్సింది. కరోనా వల్ల.. షూటింగ్ ఆలస్యమైంది. ఈనెల 8న అల్లు అర్జున్ తన పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్‌కి సుకుమార్ ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ ఏమిటన్నది బన్నీ పుట్టిన రోజున ప్రకటిస్తారని సమాచారం. ఈ చిత్రానికి `శేషాచలం` అనే పేరు పెట్టినట్టు ఇది వరకు వార్తలొచ్చాయి. అయితే వాటిని చిత్రబృందం త్రోసిపుచ్చింది. దాంతో కొత్త టైటిల్ ఏమిటో అని బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ ఇది. బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. రంగస్థలంలా ఈ సినిమా టైటిల్ కూడా మాసీగా ఉండబోతోందని సమాచారం అందుతోంది.