చిన్న పాత్రనైనా పెద్ద స్టార్‌తో చేయించాలని చూస్తున్నారు నేటి దర్శకులు. పైగా పాన్ ఇండియా మోజు పెరుగుతోంది కదా..? ఆ హంగూ, ఆర్భాటాలు తప్పనిసరి. బడా హీరోల సినిమాలకొచ్చేసరికి.. స్టార్ల హంగామా మరింత పెరుగుతోంది. అన్ని భాషల్లో సినిమాని అమ్ముకోవడానికి అదో చక్కటి మార్గం కూడానూ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే.. చిన్న చిన్న పాత్రలకు సైతం.. పేరున్న నటీనటులే కావాలి. ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాలోనూ స్టార్ బలం మెండుగా కనిపించబోతోంది.
ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్`తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఆ వెంటనే కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తీయబోతున్నాడు కొరటాల. ఓ కీలకమైన పాత్ర కోసం మమ్ముట్టిని సంప్రదించాడట. జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ని తీసుకొచ్చాడు కొరటాల. ఆ పాత్రతో కథకు హుందాతనం వచ్చింది. ఇప్పుడు కూడా ఓ కీలకమైన పాత్ర కోసం మమ్ముట్టిని తీసుకురాబోతున్నాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ విషయమై ఓ అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం.