ఎందుకో తెలీదు గానీ, చిరంజీవి అందరికీ సాఫ్ట్ టార్గెట్ అయిపోతుంటాడు. చిరుపై గానీ, ఆయన కుటుంబంపై గానీ.. విమర్శలు చేయడానికి ఎవరూ పెద్దగా ఆలోచించరు. బహుశా.... చిరు తిరిగి స్పందించడన్న ధైర్యంతో కాబోసు. లేటెస్టుగా కోట శ్రీనివాసరావు కూడా అదే చేశారు. చిరుపై మాటల దాడికి దిగారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ విరుచుకుపడ్డారు.
ఇటీవల చిరంజీవి సినీ కార్మికుల కోసం ఓ ఆసుపత్రి కట్టిస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజంగానే... అది ఆహ్వానించదగిన పరిణామం. అయితే అందులోనూ.. నెగిటీవ్ కోణం చూపిస్తూ, విమర్శలకు దిగారు కోట శ్రీనివాసరావు.``కార్మికులకు కావాల్సింది కడుపు నిండా తిండి. ముందు ఆపని చూడండి. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎవరొస్తారు? కృష్ణానగర్ లో ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. వ్యసనాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ల దగ్గర డబ్బులంటే అపోలో ఆసుపత్రికే వెళ్తారని`` వ్యగ్యంగా స్పందించారు కోట. అంతే కాదు... కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. కార్మికుడు అన్న వ్యక్తి ఏనాడైనా ఎవరికైనా సహాయం చేసారా? ఆయన సినిమాల్లో ఎవరికైనా అవకాశాలు ఇప్పించారా? నా ఇంటికి ఎవరైనా సహాయమని వస్తే 500..1000 ఇచ్చి పంపిస్తాను. ఇబ్బందుల్లో ఉన్న కార్మికుల కోసం 5 లక్షల వరకూ సహాయం చేసాను. `మా ` కోసం ఎన్నోసార్లు విరాళాలు ఇచ్చాను. వృద్దాప్యంలోనూ కార్మికుల సంక్షమ కోసం నిరాహార దీక్ష చేసాను`` అంటూ చిరుని విమర్శిస్తూనే సొంత డబ్బా కొట్టుకున్నాడు ఈ పెద్దాయన. అయితే.. చిరుని విమర్శించినంత మాత్రాన.. ఆయనపై గౌరవం లేదని కాదని, అదెప్పుడూ అలానే ఉంటుందని చివర్లో ఆయింట్‌మెంట్ పూసే ప్రయత్నం చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై చిరు గానీ, ఆయన అభిమానులు గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.