నటీనటులు : రవి తేజ, శృతి హస్సన్, వరలక్ష్మి, సముధ్రఖని తదితరులు
దర్శకత్వం : గోపీచంద్ మలినేని
నిర్మాతలు : బి మధు
సంగీతం : థమన్
సినిమాటోగ్రఫర్ : జీకే విష్ణు
ఎడిటర్: నవీన్ నూలి
రేటింగ్: 3/5
ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉండేది. సినిమా తీసిన నిర్మాతలకు, ఆ సినిమా కొన్న పంపిణీదారులకు, సినిమా చూసిన ప్రేక్షకులకు.. ఏదో ఓ సంతృప్తి దక్కేది. అలానే.. రవితేజ స్టార్ అయ్యాడు. అయితే.. గత కొన్నేళ్లుగా రవితేజ కెరీర్‌లో ఎన్నో కుదుపులు. వరుస పరాజయాలు. రవితేజ పనైపోయింది.. అనుకున్న ప్రతీసారీ.. మరో కొత్త సినిమాతో ఆశలు రేకెత్తించడం మామూలైపోయింది. `క్రాక్`కి ముందు కూడా రవితేజకు ఫ్లాపులే. కానీ `క్రాక్`పై అందరికీ ఏదో ఓ మూల నమ్మకం. ఈసినిమాతో రవితేజ గట్టెక్కేస్తాడని భరోసా. ప్రచార చిత్రాలు సైతం ఆ నమ్మకం కలిగించాయి. మరి ఈ సినిమా ఎలా వుంది? సంక్రాంతి సీజన్‌లో వచ్చిన తొలి సినిమా బోణీ కొట్టిందా, లేదా?
* కథ
వీర శంకర్ పోతురాజు (రవితేజ) ఓస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. తప్పు చేసింది ఎంతటి వాడైనా సరే - తాట తీస్తాడు. ఎవ్వరినీ లెక్క చేయడు. కటారికృష్ణ (సముద్రఖని), కొండా రెడ్డి (రవి శంకర్), జయమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)... ఈ ముగ్గురూ.. అన్యాయాలకూ, అకృత్యాలకూ.. నిలువెత్తు నిదర్శనాలే. కడపలో కొండారెడ్డి కోరలు తెంచిన వీర శంకర్... ఒంగోలులోని శాంతిభత్రతల్ని ఎలా దారికి తెచ్చాడు? అన్నదే కథ.
* విశ్లేషణ
కథగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఈ టైపు కథల్ని చాలా సినిమాల్లో చూసేశాం. అయితే ఆ కథని తీర్చిదిద్దిన పద్ధతి, అందులో మాస్ అంశాల్ని మిక్స్ చేసిన విధానం, ఎమోషన్స్ ఇవన్నీ ఆటక్టుకుంటాయి. ముఖ్యంగా రవితేజ బలాలపై బేస్ చేసుకుని రాసుకున్న కథ ఇది. రవితేజ ఏ యే సెగ్మెంట్స్‌లో దూసుకుపోతాడో.. అలాంటి వాటిని పేర్చుకుంటూ వెళ్లారు. కథ ప్రారంభం నెమ్మదిగా ఉంటుంది. హీరో ఫ్యామిలీ డ్రామాతో కథ మొదలెట్టాడు. మెల్లగా యాక్షన్ మూడ్ లోకి వెళ్తుంది. అక్కడి నుంచి కథనం జోరు అందుకుంటుంది.
వార్నింగ్‌లు, యాక్షన్ సీన్లు, ఎత్తుకు పై ఎత్తులు... ఇలా జోరు ఎక్కడా తగ్గకుండా సాగిపోతుంది. యాక్షన్ సీన్లు తీర్చిదిద్దిన విధానం మాస్ కి నచ్చుతుంది. ముఖ్యంగా ఒంగోలు బస్టాండ్ ఫైట్ అయితే గూజ్ బమ్స్ మూమెంట్ తీసుకొస్తుంది. ఎంటర్‌టైన్‌కి పెద్దగా చోటు లేని సబ్జెక్ట్ ఇది. సీరియస్ ఎమోషన్స్ తో సాగిపోతుంది. అయితే... హీరోయిజాన్ని ఎలివేట్ చేసినప్పుడు... పోతురాజు విలన్లకు వార్నింగ్ ఇస్తున్నప్పుడు ఆ పార్ట్ ఎంటర్‌టైన్‌గా ఉంటుంది.
సెకండాఫ్‌లో కూడా ఫ్లో ఎక్కడా తగ్గదు. చక చక సాగుతుంది.అయితే.. రవితేజ నుంచి ఆశించే కామెడీ మిస్ అవుతుంది. యాక్షన్ డోసు బాగా ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంటుంది. మధ్యమధ్యలో కాస్త డ్రాప్ అయినప్పుడల్లా.. ఓ యాక్షన్ సీన్ తీసుకొచ్చి పడేశాడు దర్శకుడు. యాక్షన్ సీన్లు మరీ బోర్ కొట్టించకపోవడానికి కారణం.. దానికి ముందు ఇచ్చిన ఎలివేషన్లే. రవితేజ - శ్రుతి ల రొమాంటిక్ ట్రాక్.. చాలా నీరసంగా, బోరింగ్ గా సాగుతుంది. ఆ ఎపిసోడ్ పై దృష్టి పెట్టి ఉంటే బాగుణ్ణు. క్లైమాక్స్‌లో.. మళ్లీ.. తనదైన యాక్షన్ తో రవితేజ చెలరేగిపోయాడు. ఓ ఫుల్ మాస్ మీల్స్ పెట్టి పంపిన ఫీలింగ్ కలుగుతుంది.
* నటీనటులు
రవితేజ వన్ మేన్ షో ఈ సినిమా అని చెప్పక తప్పదు. రవితేజ బాడీ లాంగ్వేజ్‌కి పర్‌ఫెక్ట్ పాత్ర ఇది. టేలర్ మేడ్ అనొచ్చు. యాక్షన్ సీన్స్‌లో.. చెలరేగిపోయాడు. అయితే లుక్ పరంగా రవితేజ శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని చోట్ల తన ముసలి తనపు ఛాయలు కనిపించేశాయి. శ్రుతి హాసన్ ట్రాక్ బోరింగ్ గా ఉంటుంది. కథకు అడ్డు పడుతూ సాగుతుంది. అయినా సరే.. చూడగలిగాం అంటే అదంతా శ్రుతిహాసన్ వల్లే. ఈ కథలో ముగ్గురు విలన్లున్నారు. ఎక్కువ మార్కులు సముద్రఖనికి దక్కుతాయి. ఆ తరవాత.. వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు చెప్పుకోవాలి. విలన్ల క్యారెక్టరైజేషన్లు ఈ కథకి మూలం. వాటిని దర్శకుడు బాగా డీల్ చేశాడు.
* సాంకేతిక వర్గం
చాలా రొటీన్ కథ ఇది. కానీ.. ఎమోషన్స్ మిస్ కాకుండా చూసుకున్నాడు దర్శకుడు. మాస్ కి ఏం కావాలో అది ఇచ్చేశాడు. యాక్షన్ సీన్లు తీర్చిదిద్దిన విధానం.. చాలా బాగుంది. అదే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్. బుర్రా సాయిమాధవ్ మాస్ ఎలివేషన్ డైలాగులూ బాగా రాయగలనని నిరూపించుకున్నాడు. తమన్ పాటలు.. థియేటర్లో దద్దరిల్లిపోతాయి. సింగిల్ స్క్రీన్‌లో చూస్తే.. ఆ మజానే వేరు. సెకండాఫ్ కాస్త ట్రిమ్ చేసుకుంటే బాగుండేది. సినిమా రిచ్ గా ఉంది.
* ప్లస్ పాయింట్స్
రవితేజ
హీరోయిజం ఎలివేషన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఫైట్స్
* మైనస్ పాయింట్స్
రొటీన్ స్టోరీ
రొమాంటిక్ ట్రాక్
* ఫైనల్ వర్డిక్ట్: పక్కా మాస్!