ఈరోజుల్లో ఓటీటీ సంస్థలు... చిత్ర రంగంపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఓటీటీ వల్ల... సినిమా రంగానికి ఎన్నో లాభాలు. థియేటర్ వ్యవస్థకు నష్టం జరుగుతోందన్న మాట వినిపిస్తున్నా - ఓటీటీ వల్ల నిర్మాతలు అదనపు ప్రయోజనాలు పొందుతున్నారు. మంచి గిట్టు బాటు రేటు లభిస్తుండడంతో.. ఓటీటీలకు సినిమాలు ఇవ్వడానికి నిర్మాతలు మొగ్గు చూపిస్తున్నారు. అయితే థియేటర్ విడుదలకూ.. ఓటీటీ రిలీజ్ కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలన్న విషయంలో స్పష్టత లేదు.
తాజాగా... క్రాక్ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈనెల 29న ఆహాలోనూ... ప్రదర్శితం అవ్వాలి. అంటే. ఓటీటీ రిలీజ్‌కీ, థియేటర్ రిలీజ్ కి మధ్య 20 రోజుల గ్యాప్ కూడా లేదన్నమాట. సినిమా థియేటర్లలో ఉండగా..ఓటీటీలోకి వస్తే ఎలా..? అందుకే క్రాక్ నిర్మాత ఠాగూర్ మధు... ఆహా ని సంప్రదించి రిలీజ్ డేట్ మార్పు చేయించారు. ఇప్పుడు ఓ వారం ఆలస్యంగా ఆహాలో విడుదల కాబోతోంది.
ఆహా `క్రాక్` సినిమాని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. విడుదలైన మూడు వారాల తరవాత.. ఓటీటీలో ప్రదర్శిస్తామన్నది ఒప్పందం. ఆ లెక్కన ఈనెల 29న ఓటీటీలో రావడం సరైనదే. కానీ క్రాక్ ఇంకా థియేటర్లలో వుంది. కలక్షన్లూ బాగా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీలో ఈ సినిమా ఉంటే, థియేటర్‌కి ఎవరొస్తారు? అందుకే... ఓటీటీ విడుదల వాయిదా పడింది. అయితే ఆ మేరకు ఆహాకి నష్టపరిహారం చెల్లించడానికి మధు రెడీ అయ్యార్ట. కనీసం 20 నుంచి 40 లక్షల వరకూ.. సొమ్ము వాపన్ చేయనున్నారని సమాచారం. అందుకే ఆహా కూడా అందుకు ఒప్పుకుందని తెలుస్తోంది.