రెండు పడవలపై రెండు కాళ్లువేసి ప్రయాణం చేయడం చాలా కష్టం. ప్రమాదం కూడా. ఒకేసారి రెండు పనులపై దృష్టి పెట్టడం కూడా అంతే. దానికి చాలా అనుభవం, నేర్పూ కావాలి. అయితే క్రిష్ మాత్రం ఒకేసారి మూడు పడవల ప్రయాణం చేస్తున్నాడు. దర్శకుడిగా క్రిష్ బిజీ. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా రూపొందిస్తున్నాడు. మరోవైపు నిర్మాతగానూ బిజీ. కొన్ని టీవీ సీరియళ్లకి క్రిష్ నిర్మాత. అంతరిక్షంలాంటి సినిమాల్ని కూడా అప్పుడప్పుడూ రూపొందిస్తుంటాడు. ఇప్పుడు వెబ్ సిరీస్‌లపై కూడా దృష్టి పెట్టాడు. అల్లు అరవింద్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓటీటీ ఫ్లాట్ ఫామ్.. ఆహా. దీని కోసం ఇది వరకే క్రిష్ ఓ వెబ్ సిరీస్‌ని అందించాడు.
ఇప్పుడు ఒకేసారి రెండు మూడు వెబ్ సిరీస్‌లను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. దీనికి నిర్మాతగా వ్యవహరించడమే కాదు, ఆయా వెబ్ సిరీస్‌ల కథలను కూడా క్రిష్‌నే అందించనున్నాడని టాక్. అన్నింటికంటే ముఖ్యంగా క్రిష్ మంచి యాడ్ ఫిల్మ్ మేకర్. ఇప్పటికే కొన్ని కమర్షియల్ యాడ్స్‌ని రూపొందించాడు. ఒకే సారి ఇన్ని పనుల్ని నెత్తిమీద వేసుకుని చేయడం ఈయనకు ఎలా సాధ్యమైందో..?