భారీ తారాగణంతో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాని తెరకెక్కించి సంచలనం సృష్టించాడు క్రిష్. ఇదో చారిత్రక నేపథ్యం ఉన్న సినిమానే అయినా కానీ చాలా తక్కువ టైంలో ఈ సినిమాని పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. అత్యంత భారీ సెట్టింగులతో వారెవ్వా అనే రేంజ్‌లో ఈ సినిమాని తెరపై చూపించాడు. భారీ బడ్జెట్‌తో అత్యంత క్రిటికల్‌గా తెరకెక్కించినా, అనుకున్న టైంకే ఈ సినిమాని విడుదల చేయగలగడం క్రిష్ వల్లనే అయ్యింది. అందుకే దర్శకుల్లో క్రిష్ ప్రత్యేకతే వేరు. తాజాగా బాలీవుడ్‌లో ఓ సినిమాకి పచ్చ జెండా ఊపాడు క్రిష్. అది కూడా హిస్టారికల్ మూవీనే. 'గౌతమీ పుత్ర శాతకర్ణి' జీవిత చరిత్రని తెలుగు ప్రజలకి పరిచయం చేసిన క్రిష్, ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాథని తెరపై ఆవిష్కరించబోతున్నాడు ఈ సారి. 'మణికర్ణిక' అనే అందమైన టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్ చేశారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ సినిమాలో లక్ష్మీ భాయ్ పాత్రలో నటిస్తోంది. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో కంగనా ఆకట్టుకోనుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాని విడుదల చేయనున్నాడు క్రిష్. చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో క్రిష్‌ది అందె వేసిన చేయి. ఆ తరహా సినిమాలని క్రిష్ సినిమాగా కాకుండా ఓ యజ్ఞంలా భావిస్తాడు. అందుకే అవుట్ పుట్ అంత అద్భుతంగా ఉంటుంది. మరో స్పెషల్ ఏంటంటే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజే రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించేశాడు క్రిష్. ఏప్రిల్ 27 2018న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.