ఇంటెలిజెంట్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్న సినిమా 'మణికర్ణిక'. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత గాధే ఈ మణికర్ణిక. దాదాపు నిర్మాణం పూర్తి చేసుకుందనుకున్న ఈ చిత్రం ఇప్పుడు క్రిష్‌ని కష్టాల్లో పడేసిందట.
ఈ మధ్య క్రిష్ తెలుగులో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'ఎన్టీఆర్'ని తెరకెక్కించే బాధ్యత తన భుజాల మీదేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి బిజీగా ఉన్న క్రిష్ మరోసారి బాలీవుడ్‌కెళ్లాడట. ఇందుకు కారణమేమంటే, బాలీవుడ్‌లో సినిమాలు అంత తొందరగా ఓ కొలిక్కి రావనే చెప్పాలి. అలాంటిది ఆ సినిమా ఇంకా ప్రేక్షకుల ముందుకు రాకుండానే, క్రిష్ 'ఎన్టీఆర్' ప్రాజెక్ట్‌ని పట్టుకున్నాడు. అలా 'మణికర్ణిక'ను వదిలేసి దీంట్లో పూర్తిగా మనసు పెట్టలేకపోతున్నాడట క్రిష్. దానికి తగ్గట్టుగా మరో కొత్త తంటా వచ్చిపడిందట.
'మణికర్ణిక'ను ఓ కొలిక్కి తీసుకొచ్చేశాననుకున్న క్రిష్ ఆలోచన తారుమారైంది. 'మణికర్ణిక' సినిమాలోని కొన్ని సీన్స్ విషయంలో నిర్మాతలు సంతృప్తి చెందకపోవడంతో మళ్లీ ఆ సీన్స్‌ని రీ షూట్ చేయాల్సి వస్తోందట. దాంతో అక్కడా ఇక్కడా ఒకేసారి మనసు లగ్నం చేయడం క్రిష్‌కి పెద్ద తలనొప్పిగా మారింది. అందులోనూ రెండు ప్రాజెక్టులూ టఫ్ ప్రాజెక్టులే కావడం క్రిష్‌కి కత్తి మీద సాములా తయారయ్యాయి.
చూడాలి మరి క్రిష్ అటు 'మణికర్ణిక'ను, ఇటు 'ఎన్టీఆర్'ను ఎలా మేనేజ్ చేస్తాడో.