బాలకృష్ణ ప్రధాన పాత్రలో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా ఈ సినిమా దర్శకత్వం నుండి తేజ తప్పుకోవడంతో ఎన్టీఆర్ బయోపిక్ కష్టాల్లో పడింది. దాదాపుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని భావించారంతా. కానీ బాలయ్య మాత్రం ఈ సినిమాని ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారట. ఎలాగైనా ఈ చిత్రం తెరకెక్కించాలని గట్టి పట్టుదలతో ఉన్నారట. ఆ కోణంలోనే పలువురు దర్శకులను సంప్రదించారట.
ఆ దిశగా బాలయ్య మదిలో మెదిలిన డైరెక్టర్ క్రిష్. క్రిష్ - బాలయ్య కాంబినేషన్‌లో గతేడాది 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా సంచలన విజయం అందుకుంది. అందుకే క్రిష్‌నే ఈ సినిమాకి కరెక్ట్ డైరెక్టర్ అని భావించి ఆయన్ని ఒప్పించాడట బాలయ్య. బాలయ్య అంతగా అడిగేసరికి క్రిష్ ఒప్పుకోక తప్పలేదట. దాంతో ఎన్టీఆర్ బయోపిక్ మళ్లీ పట్టాలెక్కనుంది. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్‌లో 'మణికర్ణిక' సినిమాతో బిజీగా ఉన్నాడు. చివరి దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది. ఆ తర్వాత క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్‌ని టేకప్ చేసే యోచనలో ఉన్నాడట.
మరోవైపు ఈ సినిమాకి మిగిలిన నటీనటుల్ని ఎంపిక చేసేందుకు ఓ ప్రత్యేకమైన టీమ్‌ని ఏర్పాటు చేశాడట బాలయ్య. ఆ క్రమంలో ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రను పోషించేందుకు బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఓకే చేసిందనీ తాజా సమాచారమ్. గత కొంతకాలంగా ఆ పాత్రకు విద్యాబాలన్ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆమె అంగీకరించిందనీ తెలుస్తోంది.
అలాగే ఎన్టీఆర్ జీవితంలో మరో కీలక వ్యక్తి చంద్రబాబు పాత్రను రానా పోషించనున్నాడనీ ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తదుపరి రూపకల్పన ఎలా ఉండబోతోందో.!