ఇటీవల ఓటీటీ ద్వారా విడుదలైన సినిమా `కృష్ణ అండ్ హిజ్ లీల`. నెట్ ఫిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి మంచి స్పందనే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులు మొదలయ్యాయి. ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలకు కృష్ణ, రాధ, సత్య అనే పేర్లు పెట్టారు. అయితే ఆ పాత్రల పట్ల అసభ్యకకరమైన సన్నివేశాలు ఉన్నాయని, బూతులు పలికించారని విమర్శలు మొదలయ్యాయి. కొంతమంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు.
తక్షణం ఆయా సన్నివేశాల్ని తొలగించాలని, లేదంటే పాత్రల పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. చిత్ర దర్శకుడు, నిర్మాతలపై ఈ మేరకు ఫిర్యాదులు అందాయని పోలీసు వర్గాలు సైతం ధృవీకరించాయి. విడుదలకు ముందు ఈ సినిమాకి ఎలాంటి ప్రచారమూ లేదు. విడుదల తరవాత మాత్రం ఈ సినిమా ఏదోలా ప్రచారాన్ని దొరకబుచ్చుకుంటోంది. నిన్నటికి నిన్న హీరో - దర్శకుడి లిప్ లాక్ టాలీవుడ్ ని షేక్ చేసింది. ఇప్పుడు ఈ వివాదం ఒకటి. మొత్తానికి ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తోంది ఈ కృష్ణ లీల.