మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. #VT10 గా పిలుచుకుంటున్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమా కథ ప్రకారం 'బాక్సర్', 'ఫైటర్' అనే టైటిల్స్ సూట్ అవుతాయట. ఈ సినిమాలో వరుణ్ ఓ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు కాబట్టి ఈ టైటిల్స్ కరెక్ట్ గా సూట్ అవుతాయట. అయితే ఈ రెండు టైటిల్స్ అందుబాటులో లేవట. ఎందుకంటే ఈ టైటిల్స్ న పూరి జగన్నాధ్ టీమ్ తమ సినిమా కోసం రిజిస్టర్ చేయించిపెట్టారట. పూరి ప్రస్తుతం యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆ రెండు టైటిల్స్, వాటితో పాటుగా 'లైగర్' అనే మరో టైటిల్ పరిశీలనలో ఉన్నాయట. ఒకవేళ 'బాక్సర్', 'ఫైటర్' టైటిల్స్ ను పూరి టీం కనుక వాడుకోని పక్షంలో 'VT10' టీమ్ వాటిని తీసుకోవాలని భావిస్తున్నారట. లేకపోతే రెండిట్లో ఒక టైటిల్ పూరి సినిమాకు ఫైనలైజ్ చేస్తే మరో టైటిల్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.
ఈమధ్యే పూరి సినిమా కో ప్రొడ్యూసర్ ఛార్మి త్వరలోనే విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ప్రకటిస్తామని వెల్లడించింది. పూరి సినిమా టైటిల్ కనుక ఫైనలైజ్ అయితే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా #VT10 టీమ్ తమ టైటిల్ ను ప్రకటించే ఆలోచనలో ఉన్నారట.