సూపర్ స్టార్‌కు భయమన్నదే లేదు. ఆయన మొండితనం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్‌తోనే `సై అంటే సై` అని ఎదురుతిరిగిన తత్వం ఆయనది. ఇండస్ట్రీకి ఏ కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టాలన్నా... ఆయనే పూనుకొనేవారు. నిజంగానే కృష్ణ... రియల్ స్టార్. ఆయనకు భయమన్నదే లేదు. కానీ ఓ సబ్జెక్ట్ ముట్టుకోవడానికి మాత్రం కృష్ణ భయపడ్డారు. తనెంతో ఇష్టపడిన స్క్రిప్టుని సైతం పక్కన పెట్టారు.
'అల్లూరి సీతారామరాజు' ఎన్టీఆర్‌కి చాలా ఇష్టమైన సబ్జెక్ట్. అల్లూరి కథతో సినిమా చేద్దామనుకొన్నారు ఎన్టీఆర్. కానీ అనూహ్యంగా ఎన్టీఆర్ కంటే ముందే `అల్లూరి సీతారామరాజు` సినిమా మొదలెట్టి, ఎన్టీఆర్ చేతే సెభాష్ అనిపించుకొన్నారు కృష్ణ. ఆ సమయంలోనే `ఛత్రపతి శివాజీ` కథపై కూడా కృష్ణకు మనసైంది. ఛత్రపతి సినిమాని చేద్దామని ఆయన రచయిత మహారథి తో స్క్రిప్టు కూడా తయారు చేయించుకొన్నారు.
కాకపోతే... ఆ కథలో వివాదాస్పద అంశాలు కొన్ని ఉన్నాయి. వాటితో మత ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని గ్రహించారు కృష్ణ. తన వల్ల గానీ, తన సినిమా వల్ల గానీ అశాంతి జరిగితే.. అది తన సినీ జీవితానికే తీరని మచ్చ అని భావించిన కృష్ణ.. తొలిసారి వెనకడుగు వేశారు. 'ఛత్రపతి శివాజీ' స్క్రిప్టుని అలా వదిలేశారు. ఆ తరవాత... 'చంద్రహాస్' అనే ఓ సినిమాలో కాసేపు ఛత్రపతి శివాజీగా కనిపించారు.నెంబర్ వన్ లోనూ ఆ గెటప్పులో కనిపించి ముచ్చట తీర్చుకొన్నారు కృష్ణ.